8 May, 2026 | 1:03 AM

షాడో ప్రతినిధులూ.. మీరు మారరా..?

08-05-2026 12:00 AM
  1. ఆమెది అధికారం.. ఆయనదే పెత్తనం...
  2. మహిళల ఎదుగుదలకు వారే అడ్డు..
  3. ప్రేక్షకులుగా మహిళా ప్రతినిధులు 
  4. అవకాశాలొచ్చిన నిష్ఫలమేనా..?

బెల్లంపల్లి, మే 7 : ఆకాశంలో సగం.. సమాజంలో సగం... అన్నట్టూ మహిళలూ రాజకీయాల్లోనూ సగంగా బలపడ్డారు. ఇది మంచి పరిణామమే... కాగా పురుషుల్లో అధికార కాంక్ష మాత్రం రోజు రోజూకూ శృతిమించింది. రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు పెరిగాయి. రిజర్వేషన్లు కూడా మహిళలకు కలిసొచ్చాయి.. కానీ మహిళలు గెలిచినప్పటికీ అధికారం దర్ఫం చూపించేది పురుషులే. ఈ పద్దతి మారాలి. వచ్చినా అవకాశాలను మహిళల రాజకీయ పురోగతికి వదిలేయాలి.

అలా పురుషుల జోక్యం తగ్గే వరకు మహిళలు ముందుకు వెళ్లడం కష్టమే. వారికి పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వాలి. పురుషులు గైడెన్స్ గా తోడ్పాటు అందించాలి. ఇది జరగడంలేదు. ఒక్క సర్వసభ్య సమావేశాల్లో మాత్రం మహిళలు వారి జోక్యం లేకుండా స్వేచ్ఛగా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ఈ ఒక్క ప్రక్రియలో మాత్రమే పూర్తిగా పురుషులు దూరంగా ఉంటున్నారు. ఇది మినహా ఇక అన్ని తానై అన్నట్టు ప్రతి పనిలో పురుషుల ప్రమేయం లేకుండా మహిళలు ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కొనసాగుతుంది.

ఇటీవల జరిగిన బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ తీరులో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. మహిళలకు అవకాశాలు మెండుగా వచ్చాయి. ఫలితంగా బెల్లంపల్లిలో 34 వార్డుల్లో 21 మహిళలకు పోటీచేసే అవకాశం వచ్చింది.. మెజార్టీ వార్డులు రిజర్వేషన్ల ప్రకారం మహిళలకే దక్కాయి. దీంతో ఈ ఎన్నికల్లో మహిళకు ప్రాధాన్యత పెరిగింది. రాజకీయాల్లో మహిళకు పెద్దపీట తప్పలేదు. మహిళల భాగస్వామ్యం మునుపెన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగింది.

దీంతో పరిపాలన రంగంలో అనూహ్యమైన మంచి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మెజార్టీ సీట్లు మహిళల పరమై పురుషులకు కేవలం 13 వార్డులు మాత్రమే మిగిలాయి. స్థానిక పరిపాలన దక్షతలో సింహభాగం మహిళల వశమైంది. ప్రధాన పాలక చైర్మెన్ సీటు పగ్గాలు సైతం మహిళలకే దక్కాయి. రిజర్వేషన్లు అనూహ్యంగా మహిళలను ఒక్కసారిగా పరిపాలన పీఠం మీద కూర్చుండ పెట్టాయి. 

తీరు మారాలి..

స్థానిక రాజకీయ రంగంలో మహిళలకు వస్తోన్న అవకాశాల మేరకు పురుషుల జోక్యం తగ్గు ముఖం పట్టాలి. వారి తీరు, స్వాభావికంగా సమూల మార్పు మారాలి. వారి ప్రమేయం తగ్గుదలపైనే మహిళల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పుడిప్పుడే మహిళలు వంటింటి సంకెళ్ళు తెంచుకుని బయటకు వస్తున్నారు. పరిపాలన రంగంలో రాజకీయ స్వయం ప్రతిపత్తి పెరుగుతున్న తీరుకు మహిళలకు తగిన చేయూత ఇవ్వాల్సిన బాధ్యత పురుషులపై ఎంతైనాఉంది.

ఇది మొదటగా పురుషులు గుర్తించాలి. ఇది అమలు జరిగినప్పుడే మహిళల రాజకీయ వికాసం సవ్యంగా సాగుతోంది. రాజకీయాల్లో మహిళా మణులు పురోగమిస్తారు. ఈ పరిస్థితిలో మార్పు రాకపోతే మహిళలకు వస్తోన్న అవకాశాలు పురుషులకు రాజకీయ సాదనాలే అవుతాయి. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతున్నది. మహిళా ప్రతినిధులు ఇంటికే పరిమితం అవుతున్నారు. వారికి బదులు బంధువులు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు.

వారి మితిమీరిన జోక్యం మహిళలను మళ్ళీ వెనక్కి నెట్టుతున్నది. వంటిoటికే పరిమితం చేస్తున్నది. ఎప్పటివలె పురుషులే అధికారిక ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారు. తెల్లచొక్కాలు వేసుకుని ఎక్కడా చూసినా వారే కనిపిస్తున్నారు. లాంఛనీయంగా మాత్రమే మహిళా ప్రతినిధులను అధికారిక కార్యక్రమాలకు మాత్రమే తీసుకెళ్తున్నారు. ఇప్పటి నుంచైనా తమ అధికార కక్కుర్తినీ కాసింత పక్కన పెట్టీ మహిళా ప్రతినిధులకు సహాయకారిగా మారాలి.

అవసరమైనా సమయంలో తగిన చేయూతను అందించాలి. ఇలా వారి రాజకీయ పురోగతికి తోడ్పాటును పురుషులు అందించాలి. అంతే కాని వారిని ప్రేక్షకులుగా మార్చే తమ ఆధిక్యతను చాటే పురుషాధిక్యత భావజాలాన్ని కాస్తా ఇప్పటికైన పక్కన పెట్టీ వారికి స్వేచ్ఛను ఇవ్వాలి. అందుకు ఆది పత్యభావజాలానికి స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైంది.