10 April, 2026 | 3:01 AM

షేక్‌పేట్ ట్యాంక్ మోడల్ కారిడార్ అభివృద్ధి

10-04-2026 01:09 AM

బస్సులో అధికారుల క్షేత్రస్థాయి పర్యటన

జూబ్లీహిల్స్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): నగరంలోని కీలకమైన షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ఉన్న రహదారిని ’మోడల్ కారిడార్’గా తీర్చిదిద్దేందు కు అధికార యంత్రాంగం రంగంలోకి దిగిం ది. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో గురువారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి. కర్ణన్ ఇతర ఉన్న తాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.

అధికారుల బృందం అంతా కలిసి ఒకే బస్సులో ప్రయాణిస్తూ, మార్గమధ్యలో ఉన్న బాటిల్ నెక్లు, నీరు నిలిచే ప్రాంతాలు, ఆక్రమణలను స్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలపై దిశానిర్దే శం చేశారు.ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ సమస్యలను తక్షణమే చేయదగ్గ పనులు, దీర్ఘకాలిక పనులు గా విభజించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించడమే కాకుం డా, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా అవసరమైన చోట మార్పులు చేస్తామన్నారు.

ముఖ్యంగా నానల్ నగర్ జంక్షన్ వద్ద ఉన్న రోటరీ వెడల్పును తగ్గించి, రహదారిని వెడల్పు చేయాలన్నారు. రేతిబౌలి నుంచి నానల్ నగర్ వరకు ఉన్న సెంట్రల్ మీడియన్ను తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎం సీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ.. నగరంలోని ట్రాఫిక్ మెరుగుదల పనుల నిమిత్తం ప్రతి జోన్కు రూ. 20 కోట్ల చొప్పున మొత్తం రూ. 120 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు.

ఎస్‌డిఐ హాస్పి టల్, బృందావన్ కాలనీ రోడ్ నెం.1 వద్ద కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామన్నారు. షేక్పేట్ నాలా వద్ద పెలికాన్ సిగ్నల్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే కేబీఆర్ పార్క్ వద్ద పెండింగ్లో ఉన్న పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎన్‌ఎమ్ డిసి, డెల్ స్టోర్ ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టి రహదారి విస్తరణకు చర్యలు తీసుకుంటామన్నారు.

రహదారి మధ్యలో అడ్డంకిగా ఉన్న రామాలయం ఆర్చ్, బొడ్డురాయి, షేక్పేట్ నాలా సమీపంలోని సమాధులను సంబంధిత వర్గాలతో చర్చించి తొలగించేలా చర్యలు తీ సుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. మెహదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి రోడ్ నెం.12కు నేరుగా వెళ్లేలా స్లిప్ రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ పర్యటనలో  ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీ జోయల్ డేవిస్, జిహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు జి.ముకుంద రెడ్డి, ప్రియాంక ఆలా, ట్రాఫిక్ డీసీపీ కాజల్, చీఫ్ సిటీ ప్లానర్ కె.శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్ ఎస్. రత్నాకర్, అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, గోల్కోండ ట్రాఫిక్ ఏసీపీ డి.ధనలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.