10 April, 2026 | 3:04 AM

మహిళా రిజర్వేషన్లలో బీసీల వాటా కోసం 16న ఛలో ఢిల్లీ

10-04-2026 01:12 AM
  1. పార్టీలు, కులమతాలకు అతీతంగా తరలిరావాలి 
  2. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉప కులాలకు న్యాయం జరగకుంటే దేశవ్యాప్త ఉద్య మం చేపడతామని కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లలో బీసీలకు చోటు కల్పించాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 16న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా ప్రతి మహిళ తరలిరావాలని పిలుపునిచ్చారు.

గురువారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మహిళా బిల్లు ను తాము స్వాగతిస్తున్నామని, కానీ అందులో తమ బీసీ మహిళల వాటా ఏదని, సంఖ్యాపరంగా బీసీలకు న్యాయం జరగాలని డిమాండ్‌చేశారు.  రాజ్యాధికారంలో తమ మహిళలకు చోటు కల్పించ కుంటే ‘నరేంద్ర మోదీ హఠావో-.. బీసీ బచావో ’ నినాదంతో ముం దుకు వెళ్తామని చెప్పారు. కులగణనలో తమ క్యాటగిరీకి రిజర్వేషన్లు కల్పించాలని, రెండోసారి చేస్తామన్న హామీలపై తమకు నమ్మకం లేదని స్పష్టంచేశారు.

నిజమైన పేదలకు లబ్ధిచేకూరడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు.  ఓసీ సామాజికవర్గానికి చెందిన రాహుల్ గాంధీ.. బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్నారని, అదే బీసీ అని చెప్పుకునే మోదీ మాత్రం తమ గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. మోదీ ఇప్పటికైనా బీసీల స్థితిగతులపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని హితవుపలికారు. ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీల మిత్రులు మద్దతు తెలపాలని, బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కేవరకు విశ్రమించబోమని పునరుద్ఘాటించారు.