calender_icon.png 15 February, 2026 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి రహిత పురపాలికగా తీర్చిదిద్దండి

15-02-2026 12:46:33 AM

  1. సూర్యాపేట పట్టణాభివృద్ధికి కృషి 
  2. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  3. ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లకు అభినందన

హైదరాబాద్/ సూర్యాపేట, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి) : సూర్యాపేటను అవినీతి రహిత పురపాలక సంఘంగా తీర్చి దిద్దాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. గతంలో సూర్యాపేట పురపాలక సంఘంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు పునరావృతం కాకుండా నూతన పాలక మండలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్బోధించారు. నూతనంగా ఎన్నికైన సూర్యాపేట పురపాలక సంఘం ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

48 వార్డులకు గానూ 31 స్థానాల్లో విజయం సాధించిన కౌన్సిలర్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... జాతీయ రహదారి మీద ఉన్న సూర్యాపేట పట్టణం ఇప్పటివరకు ఊహించిన మేరకు అభివృద్ధి సాధించలేక పోయిందన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద చూపిన ఆదరణ అనన్య సామాన్యమైనదని, ప్రజలు మనమీద అపారమైన నమ్మకంతో గురుతర బాధ్యత మోపారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు పని చేయాలని సూచించారు.

జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా సూర్యాపేట పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఎప్పటికప్పుడు పట్టణాభివృద్ధిపై సమీక్షించుకుని, ప్రత్యేక ప్రణాళికలు రూ పొందించేందుకు కార్యాచరణ పథకాన్ని రూపొందించుకుందామన్నారు. అందుకు సరిపడా నిధులు తెచ్చి సూర్యాపేట పట్టణా న్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని భరో సా ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పీసీసీ కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు ఉన్నారు.