16 July, 2026 | 11:44 PM

‘శనివారం’ మ్యూజికల్ హీట్!

11-06-2024 12:20 AM

నాని హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నానికి 31వది. దీంట్లో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు ఎస్‌జే సూర్య ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్టింగ్‌లో ప్రస్తుతం నాని, ఎస్‌జే సూర్య మధ్య పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు.

మరో పది రోజుల్లో షూటింగ్ పార్ట్ పూర్తి కానున్నది. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నట్టు మేకర్స్ సోమవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. సంగీత ప్రియులను ఉద్దేశించి “మీ విజ్ఞప్తులు వినబడ్డాయి.. ‘సరిపోదా శనివారం’ మ్యూజికల్ హీట్ వేవ్ షురూ” అని పేర్కొన్నారు. ‘టాక్సీవాలా’, ‘ఒకే ఒక జీవితం’ వంటి సినిమాలకు బాణీలు అందించిన జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నాడు.