15 July, 2026 | 1:11 AM

నీట్ లీకేజీలో శంకర్‌దాదాలు

24-06-2024 01:05 AM
  • లీకేజీలో సల్వార్ గ్యాంగ్ 

ముఖియా కుటుంబ సభ్యులదీ కీలక పాత్ర

న్యూఢిల్లీ, జూన్ 23:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీలో సల్వార్ గ్యాంగ్ కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ శంకర్‌దాదా ఎంబీబీఎస్ తరహాలో అసలు అభ్యర్థికి బదులుగా నకిలీలతో పరీక్షలు రాయించినట్లు గతంలో గుర్తించారు. కొన్నేళ్లుగా నీట్ పరీక్షల అక్రమాల్లోనూ ఈ గ్యాంగ్ హస్తమున్నట్లు బయటపడింది. దీంతో బీహార్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జాతీయ స్థాయిలో గ్యాంగ్‌లోని కీలక సభ్యుడు రవి అత్రి హస్తమున్నట్లు పోలీసులు విశ్వసిస్తున్నారు.

అతని కనుసన్నల్లోనే లీకేజీ జరిగినట్లు భావిస్తున్నారు. ముందుగానే పేపర్‌ను చేజిక్కించుకొని దానికి కీ తయారు చేసిన సోషల్ మీడియా వేదికగా విక్రయించడంలో సల్వార్ గ్యాంగ్‌ది అందెవేసిన చేయి. వీరికి డబ్బు చెల్లిస్తే నకిలీ అభ్యర్థులను పెట్టి పరీక్షలు రాయిస్తారు. రవి కూడా గతంలో వేరేవారి కోసం మెడికల్ ఎంట్రెన్సులకు హాజరై పరీక్షలు రాసేవాడు. ఆ తర్వాత పేపర్ లీకేజీలోనూ కీలక పాత్ర పోషించడం ప్రారంభించాడు. ఇతనిని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ముఖియా కుటుంబ హస్తం

ఈసారి నీట్ పేపర్ లీకేజీలో సంజీవ్ ముఖియా కేంద్ర బిందువుగా నిలిచాడు. ఇతడు కూడా సల్వార్ గ్యాంగ్‌లో సభ్యుడే. ఇతడి కుమారుడికి కూడా ఇందులో హస్తం ఉంది. గతంలో బీపీఎస్సీ టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్ష, కానిస్టేబుల్ పరీక్షల లీకుల్లోనూ వీరి పాత్ర ఉంది. ప్రస్తుతం నీట్ పెద్ద వివాదం కావడంతో సంజీవ్ ముఖియా నేపాల్ పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.

జార్ఖండ్‌లోని హజారీబాగ్ ప్రాంతం లీకులకు కేంద్రంగా మారుతోంది. ఇక్కడ ఒయాసిస్ స్కూల్ నీట్ పేపర్ లీకేజీలో కీలకంగా వ్యవహరించినట్లు బీహార్ ఈవోయూ గుర్తించింది. ఇక్కడ ట్యాంపర్ చేసిన ప్రశ్నాపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చిలో బీపీఎస్సీకి చెందిన టీచర్ నియామక పరీక్షా పత్రాలన్ని కూడా ఇక్కడి నుంచే లీక్ చేశారు. అప్పుడూ ఇక్కడ 268 మంది అభ్యర్థులకు ముందు రోజు రాత్రి ప్రశ్నాపత్రం అందినట్లు అధికారులు గుర్తించారు.