1 May, 2026 | 4:07 AM

ఈవిటీజింగ్‌పై షీటీమ్స్ ఉక్కుపాదం

01-05-2026 02:28 AM

ఏప్రిల్ నెలలో 8 ఎఫ్‌ఐఆర్లు, 8 ఈపెట్టి కేసులు

56 మందికి కౌన్సెలింగ్.. 40 అవగాహన కార్యక్రమాలు

జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు

మెదక్, ఏప్రిల్ 30(విజయ క్రాంతి) : జిల్లాలో మహిళలు, బాలికల భద్రత కోసం షీటీమ్స్ కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్ నెలలో ఈవ్టీజింగ్కు పాల్పడిన వారిపై 8 ఎఫ్‌ఐఆర్లు, 8 ఈపెట్టి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూప్రాన్ సబ్డివిజన్లో 16 మంది, మెదక్ సబ్డివిజన్లో 40 మంది.. మొత్తం 56 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.

మహిళలను గౌరవించాలని, చట్టవిరుద్ధ చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, బస్స్టాప్లు, రద్దీ ప్రాంతాల్లో షీటీమ్స్ ఆధ్వర్యంలో 40 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిరోధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరైనా మహిళలను వేధించినా, అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్100 లేదా షీటీమ్ వాట్సాప్ నంబర్ 8712657963కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.

ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండకముందే బాలికల వివాహాలు జరిగితే వెంటనే 1098 చైల్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పనిచేస్తోందని, మానవ అక్రమ రవాణా, ఆర్గనైజ్డ్ నేరాలపై సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.