పటాన్ చెరు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ
నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశం
పటాన్ చెరు: జూలై 15వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం పటాన్ చెరు సబ్-డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. అనంతరం డీఎస్పీతో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు.
ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయ రికార్డులను, దర్యాప్తులో ఉన్న గ్రేవ్ కేసులను పరిశీలిస్తూ వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో కేసులు, అత్యాచార కేసులు, డౌరీ డెత్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన పరిష్కరించాలని, ప్రతి కేసులో చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని డిఎస్పీకి సూచనలు చేశారు.
పటాన్ చెరు సబ్ డివిజన్ హైదరాబాద్ పరివాహక ప్రాంతం కావడం వలన ఉపాది కూలీలు, ఉద్యోగుల రాకపోకల కారణంగా అధిక ట్రాఫిక్ సమస్య ఉంటుందని, ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఉండటంతో వలస కార్మికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆస్తి సంబంధిత నేరాలు జరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని అన్నారు.
పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ తనిఖీలు నిర్వహించాలని, పెండింగ్ కేసుల పరిష్కారానికి ఎస్హెచ్‌ఓలకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు. తనిఖీలకు సంబంధించిన విజిటింగ్ కాపీలను జిల్లా పోలీసు కార్యాలయానికి సకాలంలో పంపించాలని సూచించారు. ప్రతి రికార్డు సీసీటీఎన్‌ఎస్లో నమోదు అయ్యేలా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ తనిఖీలలో పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, డిఎస్పీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.






