22 March, 2026 | 1:27 AM

కల్తీ ఆహారం.. ప్రాణాలతో చెలగాటం!

22-03-2026 12:00 AM

హైదరాబాద్‌లో ‘కల్తీ’ గ్యాంగులు

కలుషిత పదార్థాలతో నెయ్యి, పన్నీరు, అల్లం ఫేస్టు, సమోసాల తయారీ

పోలీసుల దాడిలో విస్తుపోయే నిజాలు

సికింద్రాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ‘కల్తీ’ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి.  కలుషిత పదార్థాలతో నెయ్యి, అల్లం ఫేస్టు, సమోసాల తయారీతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనల్లో సికింద్రాబాద్‌లో టాస్క్‌ఫోర్సు దాడుల్లో రెండువేల ఆరువందల కిలోల నకిలీ పన్నీర్ పట్టుబడింది. దీని ఆధారంగా మరికొన్నిచోట్ల తనిఖీలు చేయగా మరో మూడువేల కిలోల పన్నీర్ దొరికింది.

ఈ పన్నీరును హోటళ్లు, క్యాటరింగ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. తయారీలో రసాయనాలు, నాణ్యతలేని పదార్థాలు ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. జియాగూడలో అబ్దుల్ రషీద్ (73 ఏళ్లు) అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిన గుడ్లతో ఎగ్ సమోసాలు, స్వీట్ కార్న్ సమోసాలు, ఉల్లిపాయ సమోసాలు తయా రు చేస్తున్నట్టు గుర్తించారు.

పదేపదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యా నికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లు తేలింది. 72 డ్రమ్ముల కల్తీ పచ్చడి పట్టుకున్నారు. అంతకుముందు కూడా పలుచోట్ల చేసిన సోదాల్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీ మిర్చిపొడి, పసుపు, గడువు ముగిసిన ఆహారపదార్థాలు పట్టుబడ్డాయి. చాలామంది హోట ళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ఆసరగా చేసుకున్న అక్రమార్కులు కల్తీదందాకు యథేచ్ఛగా తెరలేపుతున్నారు. పండగ సీజన్లలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. ఇంత జరుగుతున్నా ప్రభు త్వం ఏం చేస్తోందన్నదే ఇక్కడ ప్రశ్న. 

రసాయనాలతో తయారీ

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలనుకునే ఆశతో కొంతమంది నాణ్యతను పూర్తిగా పక్కనపెట్టి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించడం అత్యంత ప్రమాదకరం. రసాయనాలు కలిపిన పచ్చ ళ్లు, నిల్వ కోసం వాడే హానికర పదార్థాలు, కృత్రిమ రంగులు ఇవన్నీ శరీరంపై నెమ్మదిగా విషంలా పనిచేస్తాయి. జీర్ణసమస్యలు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వరకు దారితీసే ప్రమాదం ఉంది. పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం కలిగిస్తాయి.

ఫుడ్ పాయిజన్ కేసు లు పెరగడానికి కూడా ఆహార పదార్థాలలో నాణ్యత లేకపోవడమే ప్రధాన కారణం. ఇంకా పలుచోట్ల చేసిన తనిఖీల్లో మూడు వేల కిలోల కల్తీ నెయ్యి పట్టుబడింది. పదకొండు వందల కిలోలకు పైగా కల్తీ జింజర్-గార్లిక్ పేస్ట్ స్వాధీనమైంది. వీటిలో సిట్రిక్ యాసిడ్, ఇతర రసాయనాలు కలిపి తయారు చేసి హోటళ్లకు సరఫరా చేస్తున్నట్టు వెల్లడైంది. జియాగూడలో నకిలీ పచ్చ ళ్ల కేంద్రంపై చేసిన దాడిలో పాడైన కూరగాయలు, తక్కువ నాణ్యత గల పదార్థాలతో తయారు చేస్తున్నట్టు నిర్ధారణ అయింది. 

ఎంత మందిని శిక్షించారు?

కల్తీ ఆహారం కేవలం నాణ్యత సమస్యే కాదు, అది నేరపూరితం. ఇది ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే. ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికార యంత్రాంగం హడావిడి చేస్తుంది తప్పా దీనికి శాశ్వత పరిష్కారం చూపడటం లేదు. బీఎన్‌ఎస్, ఫుడ్ సేప్టీ యాక్ట్ ప్రకారం కల్తీ ఆహారం లేదా డ్రింక్స్ అమ్మితే కనీసం ఆరునెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించాలి. తీవ్రమైన అనారోగ్యానికి గురైనా, ప్రాణపాయం ఏరపడినా జైలు, లేదా జీవితఖైదు విధించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఎంత మందిని శిక్షించారు? ఎన్ని కేసులు నమోదు చేశారు? వేళ్లపై లెక్కకట్టేలా కూడా ఉండవంటే అతిశయోక్తికాదేమో! ఇలా చూస్తే పచ్చళ్లు, పేస్ట్లు వంటి రోజువారి ఆహార పదర్థాలన్నీ కల్తీకి గురవుతున్నాయి.

అంటే, మన ప్లేట్‌లో పడే ప్రతిపదార్థం కూడా ఇప్పుడు అనుమానాస్పదంగా మారుతోంది. ఇందులో వినియోగదారుల పాత్రను కూడా తీసిపారేయలేం. తక్కువ ధరల ఆశతో నాణ్యత లేని ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఈ నకిలీ దందాను మనమే ప్రోత్సహిస్తున్నట్టు అవుతోంది. సరైన ప్రమాణాలు ఉన్న ఉత్పత్తుల ను ఎంపిక చేయడం, ప్యాకింగ్ తయారీ తేదీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ గుర్తించడం, తయారీ లేబుళ్లను గమనించడం అత్యంత అవసరం. కల్తీ ఆహార దందాను అరికట్టాలంటే కేవలం దాడులు సరిపోవు. కఠినమైన శిక్షలు వేగవంతమైన న్యాయప్రక్రియ, ప్రజల్లో అవగాహన- ఈ మూడు కలిసొస్తేనే ఫలితం ఉంటుంది. లేదంటే ‘కల్తీ ఆహారం’ అనే ముప్పు మన సమాజాన్ని నిశ్శబ్దంగా కబళిస్తూనే ఉంటుంది.