బడి తెరిచినా బట్టలివ్వరా?
సర్కారు బడుల్లో ‘యూనిఫాం’ కరువు..
తరగతి గదిలో పేద విద్యార్థుల ‘న్యూనతా’ భావం
నెల దాటినా అతీగతీ లేదు
ఉపాధి కోల్పోయిన పొదుపు సంఘాలు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1.42 లక్షల మంది హైరానా
రంగారెడ్డి, జులై 16 (విజయక్రాంతి): ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం.. పేద పిల్లలకు అం తర్జాతీయ స్థాయి నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తాం‘ అంటూ పాలకులు కోట్లు ఖర్చు చేసి చేస్తున్న ప్రచారాల వెనుక ఉన్న అసలు రంగులు వెల్లడవుతున్నాయి.
విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తు న్నా, రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులకు నేటికీ కనీసం ఒక జత యూనిఫాం (ఏకరూప దుస్తులు) కూడా పంపిణీ చేయలే కపోవడం విద్యాశాఖ ఘోర వైఫల్యానికి, ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి అద్దం పడుతోంది. పుస్తకాలు రెండు విడతలుగా ఇచ్చి చేతులు దులుపుకున్న యంత్రాంగం, బట్టల పంపిణీని మాత్రం గాలికొదిలేసింది. ఇది కేవలం ఒకటో రెండో పాఠశాలల సమస్య కాదు.
రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వ రం, చేవెళ్ల, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 27 మండలాల వ్యాప్తంగా ఉన్న 1244 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో దా దాపు 1.42 లక్షల మంది విద్యార్థులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. బడికి రోజుకో రంగు దుస్తు ల్లో రావాల్సి రావడం తో ప్రభుత్వ పాఠశాలలు ఫ్యాషన్ షోలను తలపిస్తున్నాయి.
పాలసీలో మార్పు.. పొదుపు సంఘాల ఉసురు
గతంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫాంలకు సంబంధించిన ముడి సరుకును (బట్టను) టెక్స్టైల్ శాఖ ద్వా రా సరఫరా చేసేవారు. ఐకేపీ కార్యాలయాల ద్వారా గ్రామీణ మహిళా పొదుపు సంఘాలకు కుట్టుకూలి చెల్లించి, వారి ద్వారా దుస్తు లు కుట్టించి సిద్ధంగా ఉంచేవారు. దీనివల్ల గ్రామీణ మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభించేది, పాఠశాలలు తెరిచిన మొదటి రో జే విద్యార్థుల చేతికి యూనిఫాంలు అందేవి.
కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉన్న డ్రెస్సుల రంగులు మార్చి, మరింత నాణ్యమైన దుస్తులు ఇస్తామని ప్రకటించింది. ఈ ‘రంగుల మార్పు‘ నిర్ణయం కేవలం ఫైళ్లకే పరిమితమవ్వడంతో క్షేత్రస్థాయిలో బట్ట సరఫరా నిలిచిపోయింది. అటు విద్యార్థులకు డ్రెస్సులు లేక, ఇటు కుట్టుకూలి దొరకక, గత బకాయిలు విడుదల కాక పొదుపు సంఘాల మహిళలు రోడ్డున పడ్డారు.
తరగతి గదుల్లో మానసిక వివక్ష.....
యూనిఫాం అనేది కేవలం ఒక బట్టల ముక్క కాదు.. విద్యార్థుల మధ్య కుల, మత, ఆర్థిక వ్యత్యాసాలను తుడిచిపెట్టే ఒక ’ఏకరూప’ ఆయుధం.ఇప్పుడు యూనిఫాంలు లేకపోవడంతో, ఉన్నంతలో మంచి బట్టలు వేసుకునే పిల్లలు ఒకవైపు, సరైన బట్టలు లేక చిరిగిన, పాత దుస్తులతో వచ్చే నిరుపేద పి ల్లలు ఒకవైపుగా తరగతి గదులు విడిపోతున్నాయి. ఇది పేద విద్యార్థుల్లో తీవ్రమైన న్యూనతాభావానికి (ఇన్ఫీరియారిటీ కాంప్లె క్స్) దారితీస్తోందని, వారి చదువుపై తీవ్ర మానసిక ప్రభావం చూపుతోందని ఉపాధ్యాయులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్ ఉంది.. మరి బకాయిలు ఎక్కడ?
విద్యా రంగానికి వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలు, విద్యార్థుల కనీస అవసరాలైన దుస్తులు, మౌలిక వసతుల కల్పనలో ఎందుకు విఫలమవుతున్నాయని మేధావులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది దుస్తులు కుట్టిన దర్జీలకు, చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా పెండింగ్లో ఉండటం వల్లే ఈ ఏడాది సరఫరాదారులు ముందుకు రావడం లేదనే చేదు నిజం క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
ప్రభుత్వం అలసత్వం వీడాలి..
ప్రభుత్వాలు మారినా, పాలకుల విధానాలు మారినా పేద విద్యార్థుల అవస్థలు మాత్రం మారడం లేదు. కార్పొరేట్ శైలి హంగుల కంటే ముందే విద్యార్థులకు కడుపు నిండా మధ్యాహ్న భోజనం, ఒంటికి సరిపడా యూనిఫాం, కూర్చోవడానికి బెంచీలు కల్పించడం ముఖ్యం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని, కాలయాపన చేయకుండా యుద్ధప్రాతిపదికన బట్టలను సరఫరా చేసి, త్వరగా కుట్టించి విద్యార్థులకు అందజేయాలని తల్లిదండ్రులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
నామోషీగా ఉంది..
‘మాకు స్కూల్ ప్రారంభమై నెల రోజులకు పైగా అవుతోంది. పుస్తకాలు అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు స్కూల్ డ్రెస్లు ఇవ్వలేదు. అందరం కలర్ బట్టల్లో స్కూల్కు రావాల్సి వస్తోంది. పాత బట్టలు వేసుకుని వెళ్తుంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలు మమ్ములను చూసి నవ్వుతుంటే నామోషీగా ఉంది సారు.
లాలు, విద్యార్థి, ఎక్వాయిపల్లి.
పది రోజుల్లో పూర్తి చేస్తాం..
‘విద్యార్థులకు నూతన యూనిఫామ్ల కు సంబంధించి రంగు మారడం వల్ల కొంత ఆలస్యమైంది. త్వరలోనే విద్యార్థులందరికీ నూతన దుస్తులను అందజేస్తాము. ఇప్పటికే జిల్లాలో కస్తూరిబా పాఠశాలలకు పంపిణీ చేశాం. మండలాల వారీగా విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా బట్టను ఏపీఎంలకు అందజేస్తాము. అక్కడి నుంచి స్వయం సహాయక మహిళా సంఘాలకు బట్టను అందించి, విద్యార్థుల కొలతల ప్రకారం వారం రోజుల్లోనే కుట్టడం పూర్తి చేయించి, మొత్తం పది రోజుల్లోగా విద్యార్థులందరికీ కొత్త యూనిఫామ్లను అందజేస్తాం.‘
వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి






