క్షీరాభిషేకాలు, గజమాలలు వద్దు
కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మీనాక్షి నటరాజన్ ఆదేశాలు
హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో నాయకులకు పాలాభిషేకాలు, నీళ్ల అభిషేకాలు, గజమాలలు వేయడం వంటివి చేయవద్దని ఆ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆహారాన్ని వృథా చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని, కావాలంటే పోషకాహారలోపంతో బాధపడుతున్న వారికి ఆహారాన్ని దానంచేయాలని సూచించారు. అంతేకాకుండా పార్టీ సీనియర్ నాయకులు వచ్చినప్పుడు కొందరు నాయకులు జేసీబీలు, బుల్డోజర్లతో భారీ గజమాలలు వేయడాన్ని కూడా ఆమె తీవ్రంగా పరిగణించారు. ఈ వాహనాలు ‘అణచివేతకు చిహ్నాలు’గా పేర్కొన్నారు. అనవసర ఆడంబరాలకు దూరంగా ఉంటూ ప్రజాసేవ చేయాలన్నారు.






