7 June, 2026 | 1:35 AM

సర్పంచ్ సాబ్ కే కెప్టెన్సీ

07-06-2026 12:27 AM

టీ20 జట్టు సారథిగా శ్రేయాస్ అయ్యర్

వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ

వైభవ్ సూర్యవంశీకి పిలుపు

ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆసియా క్రీడలకు జట్ల ప్రకటన

ఊహించినట్టే జరిగింది. భారత టీ ట్వంటీ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడింది. అతని స్థానంలో అందరూ అనుకున్నట్టుగానే శ్రేయాస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించారు. తెలుగుతేజం తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి పిలుపునిచ్చారు. వచ్చే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ క్రికెటర్లకే ప్రాధాన్యతనిచ్చిన సెలక్టర్ల నిర్ణయంతో ఇక సూర్యభాయ్ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది.

ముంబై, జూన్ 6 : భారత క్రికెట్‌లో టీ20 జట్టుకు సంబంధించి బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సారథిగా సక్సెస్ అయినా వ్యక్తిగతంగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు ఉద్వాసన పలికింది. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న శ్రే యాస్ అయ్యర్‌ను టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించింది.

ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లతో పాటు ఆసియా క్రీడల కో సం జట్లను ప్రకటించిన బీసీసీఐ సెల క్టర్లు ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రేయాస్‌ను నియమించడానికి కారణం అతని కెప్టెన్సీనే కాదు వ్యక్తిగత బ్యాటింగ్ కూడా. ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీలను సక్సెస్‌ఫు ల్‌గా నడిపించిన శ్రేయాస్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటి ల్ అందిం చాడు. పంజాబ్ కింగ్స్ ను గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిపాడు. ఇటీవల ముగిసిన సీజన్‌లోనూ వ్యక్తిగతంగా బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. కెప్టెన్సీ ఒత్తిడి ఉన్నా ఎక్కడా తడబడకుం డా పరుగుల వరద పారించాడు.

సరిగ్గా మూడేళ్ల క్రితం రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగిన శ్రేయా స్ క్రమశిక్షణ చర్యలతో జట్టుకు దూరమయ్యాడు. అసలు టీ20 జట్టులో అతని పే రును కూడా సెలక్టర్లు మొన్నటి వరకూ పరిగణలోకి తీసుకోలేదు. కానీ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే మాట ను ఫాలో అయిన శ్రేయాస్ అయ్యర్ తన ఆటతీరుతోనూ, కెప్టెన్సీతోనూ సెలక్టర్లను మెప్పించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సారథిగా తననే ఎం పిక చేసేలా నా యకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో సూర్యకుమార్ పేలవ ఫామ్ కూడా సెలక్టర్లను ఆలోచనలో పడేసింది. 

ఒకప్పుడు మిస్టర్ 360గా అభిమానులతో పిలిపించుకున్న సూర్యకుమార్ మునుపటిలా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. దాదాపు ఏడాది నుంచి కనీ సం హాఫ్ సెంచరీ కూడా సాధించలేదు. అదే సమయంలో వ యసు రీత్యా కూడా సెలక్టర్లు సూర్యకుమార్‌ను తప్పించినట్టు తెలుస్తోం ది. వచ్చే టీ ట్వంటీ ప్ర పంచకప్‌కు యువ క్రికెటర్లతో అత్యుత్తమ జట్టు ను తయారు చేసే ఉద్దేశంతో ఉన్న సెలక్టర్లు శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. ఇదిలా ఉంటే శ్రేయాస్‌కు డిప్యూటీగా తిలక్ వర్మ ఎంపికయ్యాడు.

భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న తిలక్ వర్మకు ఇది గుర్తింపుగానే చెప్పాలి. టాపార్డర్‌లో కీలక బ్యాటర్‌గా, అద్భుతమైన ఫీల్డర్‌గా పేరున్న తిలక్‌ను నాయకుడిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశం సెలక్టర్ల ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. దీంతో 15 ఏళ్ల సూర్యవంశీ.. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయష్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.అలాగే ఐపీఎల్‌లో రాణించిన ప్రిన్స్ యాదవ్‌కు చోటు దక్కింది.

అటు చాలా రోజుల తర్వాత సిరాజ్ టీ20 జట్టులోకి తిరిగొచ్చాడు. ఈ రెండు సిరీస్‌లకు బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో సెలక్టర్లు సిరాజ్‌ను ఎంపిక చేసారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో సిరాజ్ ఆకట్టుకున్నాడు. 17 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆసియా క్రీడల జట్టులో బుమ్రాను తీసుకోవడంతో సిరాజ్ కు చోటు దక్కలేదు. సీనియర్ ఆటగాళ్లు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, సిరాజ్, అర్షదీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే ఐర్లాండ్ పర్యటనలో భారత్ రెండు టీ20లు ఆడనుంది. జూన్ 26, 28వ తేదీల్లో ఆ మ్యాచ్లు డబ్లిన్ వేదికగా జరగనున్నాయి. ఇక జూలై 1 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌తో 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి.

ఐర్లాండ్ సిరీస్‌కు భారత టీ20 జట్టు

శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, దూ బే, వైభవ్, బిష్ణోయ్, సిరాజ్, హర్షి త్ రాణా, అర్షదీప్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్

ఇంగ్లాండ్ సిరీస్‌కి భారత టీ20 జట్టు

శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, దూ బే, వైభవ్, బిష్ణోయ్, సిరాజ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్

ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టు

శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి