12 April, 2026 | 6:12 PM

చిక్కుల్లో సిద్ధరామయ్య సీటు

28-08-2024 02:57 AM
  1. వరుస కుంభకోణాలతో సీఎం పీఠానికి ఎసరు 
  2. తాజాగా ఖర్గే భూవివాదమూ ఆయన మెడకే 
  3. ముప్పేట దాడి చేస్తోన్న బీజేపీ, విపక్షాలు 
  4. డిప్యూటీ సీఎం డీకేఎస్ హస్తముందని ఊహాగానాలు

బెంగళూరు, ఆగస్టు 27: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సీటు చిక్కుల్లో పడింది. వరుస కుంభకోణాల ఆరోపణలు వెల్లువెత్తున వేళ కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే ముడా, వాల్మీకి కుంభకోణాలు సీఎం పీఠానికి ఎసరు పెడుతుండగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు చెందిన ట్రస్టుకు ప్రభుత్వం ఐదెకరాల భూమిని కేటాయించిందన్న వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వంలో ఎలాంటి కుదుపులు రానున్నాయనే ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారాలన్నీ తిరిగి సీఎం సిద్ధరామయ్య సీటుకు గండి కొట్టేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఖర్గే ట్రస్టుకు 5 ఎకరాలు

ఖర్గే కుటుంబానికి సంబంధించిన ట్రస్టుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. బెంగళూరుకు సమీపంలోని డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ ట్రస్టుకు.. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్టు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇప్పటికే రెండు కార్పొరేషన్ల స్కాములతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కర్ణాటక కాంగ్రెస్ సర్కారును ఈ వ్యవహారం మళ్లీ ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగమే అని బీజేపీ ఐటీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో బంధుప్రీతి ఎక్కువైపోయిందని, పారిశ్రామికవేత్తలకు కేటాయించాల్సిన విలువైన భూముల ను కాంగ్రెస్ బడా నేతల బంధువులకు కేటాయిస్తోందని మండిపడ్డారు. కాగా, ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న సిద్ధార్థ విహార్ ట్రస్టుకు ఐదెకరాల భూమిని షెడ్యూల్ కులం (ఎస్సీ) కోటా కింద మంజూరు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ సమర్థించు కున్నారు. నిబంధనలకు అనుగుణంగానే స్థలం కేటాయింపు చేపట్టామని, ట్రస్టు సభ్యుల్లో ఒకరైన రాహుల్ ఖర్గే ఐఐటీ చదివారని, వారి కుటుంబం విద్యారంగంలో ఎన్నో ఏళ్లుగా తమ సేవలు అందిస్తోందని తెలిపారు. అక్కడ వారు పరిశోధనలు, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించినట్లు మంత్రి స్పష్టం చేశారు.

బీజేపీ ముప్పేట దాడి

ఇప్పటికే ముడా, వాల్మీకి స్కాములతో సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలను తీవ్రతరం చేస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎంపిక సీఎం కనుస న్నల్లోనే జరిగిందని విపక్షాలు మండిపడుతున్నాయి. ముడా స్కామ్ ద్వారా సిద్ధరామ య్య, ఆయన కుమారుడు యతీంద్ర రూ.4 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నాయి. సీఎం సొంత జిల్లా మైసూరులో తన సతీమణి పార్వతమ్మ పేరు మీద చట్టవిరుద్ధంగా రూ.కోట్ల విలువైన భూము లు కేటాయించుకున్నారని బీజేపీ ఆరోపణ. ఈ విషయంలో ముడా ఉన్నతాధికారుల ప్రమేయమూ ఉందని, సీఎంకు తెలియకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా? అన్ని బీజేపీ ప్రధాన ప్రశ్న. 

డీకే ప్రయత్నాలేనా?

ఈ పరిణామాల నడుమ సిద్ధరామయ్యపై కాంగ్రెస్ నేతలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. దీని వెనుక డిప్యూటీ సీఎం శివకుమార్ హస్తం ఉన్నమున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పీఠం కోసం ఇరువురి మధ్య హోరాహోరీ నడిచింది. చివరికి సీనియర్ నేత అయిన సిద్ధరామయ్య వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. ఆ సమయంలో డీకే కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా మరికొందరు మాత్రం బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా మొత్తం వ్యవహారమంతా సిద్ధరామయ్య సీటుకే గండికొట్టేలా కనిపిస్తోంది. 

వాల్మీకి కుంభకోణమూ..

వాల్మీకి కార్పొరేషన్‌లోనూ కుంభకోణాలు జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.187 కోట్ల స్కామ్ జరిగిందని, ఈ విషయంలోనూ ప్రధాన ఆరోపణలు సీఎం సిద్ధరామయ్య మెడకే చుట్టుకున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఈడీ, సీబీఐ, సిట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో వాల్మీకి కార్పొ రేషన్ సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ ఆత్మహత్య చేసుకోవడం పెను దుమారమే లేపింది. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడంతో విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్న సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ స్కాములోనూ పెద్దనేతలు ఉన్నారని, ఎమ్మెల్యేలు, మంత్రులకు లింకులు ఉన్నాయని బీజేపీతో పాటు విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.