6 July, 2026 | 12:43 AM

అరుదైన సూఫీ కవి వరకవి సిద్ధప్ప

06-07-2026 12:00 AM

‘ఏ కులంబని నన్ను ఎరుకతో నడిగేరు.. నా కులంబును జెప్ప నాకు సిగ్గు’ అంటూ నాడు సమాజంలోని కులజాఢ్యాన్ని, అసమానతలను సూటిగా ప్రశ్నించిన అరుదైన ప్రజాకవి సిద్ధప్ప వరకవి. భక్తి మార్గంలో నడుస్తూనే సమాజంలోని మూఢత్వాన్ని, కపటత్వాన్ని ఎండగట్టిన ధిషణ ఆయనది. సూఫీ తత్వాన్ని తన తెలుగు కవితల్లోకి తీసుకువచ్చిన అరుదైన కవిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. లౌకికవాదాన్ని, మానవతావాదాన్ని ఇస్లామిక్ సూఫీ చింతనతో ముడిపెట్టి, తెలుగు పద్యాల్లో ఆవిష్కరించిన తీరు ఆయనను అరుదైన కవిగా నిలబెట్టింది.

కులమతాల హద్దులను చెరిపేస్తూ, అంతా ఒక్కటే అనే సమతా నినాదాన్ని ఆయన ఎలుగెత్తి చాటారు. వరకవి నేటి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో ఒక సాధారణ కుమ్మరి కుటుంబంలో జన్మించారు. లక్ష్మమ్మ, పెద్దరాజయ్య దంపతులకు 1903లో ఆయన జన్మించారు. పల్లెటూరి వాతావరణంలోనే ఆయన పెరిగారు. ఆయన చదివింది కేవలం ఏడవ తరగతి వరకు, అది కూడా ఉర్దూ మీడియంలో చదవడం విశేషం.

అయినప్పటికీ ఆయనకు ఆరు భాషలపై అద్భుతమైన పట్టు ఉండేది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన, ప్రవృత్తిరీత్యా సమాజ సేవకుడిగా మారారు. స్వరాజ్య ఉద్యమ సమయంలో నిజాం ప్రభుత్వం విధించిన నియమాలకు విరుద్ధంగా, రూమి టోపీని కాదని గాంధీ టోపీ ధరించి విధులకు వెళ్లడంతో ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆ తర్వాత ప్రజల కోసం వాస్తు, వైద్య, ఆయుర్వేద శాస్త్రాలలో నైపుణ్యం సంపాదించి ప్రజా సేవకే అంకితమయ్యారు. సిద్ధప్ప వరకవి సాహితీ ప్రస్థానం ఎంతో విశిష్టమైనది. తన కులవృత్తి పనులు చేసుకుంటూనే మంత్రముగ్ధులను చేసే కవిత్వాన్ని ఆయన అల్లారు.

సీసం, గీతం, కందం, ఆటవెలది, తేటగీతి వంటి ప్రక్రియల్లో అద్భుతమైన పద్యాలను సృష్టించారు. ‘జ్ఞానబోధిని’ అనే గ్రంథాన్ని నాలుగు భాగాలుగా రచించడంతో పాటు యక్షగానాలు, స్తోత్రాలు, కాలజ్ఞానాలు, తత్త్వకీర్తనలు వంటి సుమారు 25 పుస్తకాలను ఆయన వెలువరించారు. యోగి వేమనను తాతగా, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని తండ్రిగా భావించి వారి అడుగుజాడల్లో నడిచారు. వీరి పద్యా ల్లో జాషువా, కాళోజీల సామాజిక స్పృహ ముందే కనిపిస్తుంది. నాటి ప్రముఖ పండితుడు సురవరం ప్రతాపరెడ్డి తన గోల్కొండ పత్రికలో సిద్ధప్ప కవిత్వాన్ని ప్రశంసించారు.

అలాగే పరిశోధకులు నీల జంగయ్య తన పరిశోధన గ్రంథంలో సిద్ధప్ప పద్యాలను వేమన, కబీర్‌దాస్‌తో పోల్చారు. నిజాం కాలపు చీకటి రోజుల్లో అవిద్య, అసమానతలతో నలిగిన ప్రజలకు ఆయన అక్షరాలు ఎంతో సాంత్వన చేకూర్చాయి. సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను ప్రజల హృదయాల్లో ఆరాధ్యుడిగా నిలిచారు. తన వద్దకు వచ్చే ప్రజల కష్టసుఖాలను పంచుకుంటూ భవిష్యత్తును బోధించి ధైర్యం కల్పించేవారు.

ఆనాటి ప్రజలు ఆయనకు ’వరకవి’గా, ’తత్వకవి’గా గౌరవాన్ని అర్పించారు. తన మరణాన్ని ముందుగానే ఊహించిన సిద్ధప్ప వరకవి, 1984 మార్చి 23న 3 గంటలకు ప్రశాంతంగా ప్రాణాలు విడిచారు. ఆయన భౌతికంగా దూరమైనా, ప్రజలు ఆయనపై ఉన్న గౌరవంతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు ఆయన శిష్యులు, అభిమానులు ఆ విగ్రహం సాక్షిగా గురుపూజోత్సవాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నారు. 

 సుధీర్