అధికార ధీమా X ఆశల పల్లకి
డా.తిరునహరి శేషు :
అధికారం ఎవరికి, ఎప్పుడూ శాశ్వతం కాదు. రాజకీయ పార్టీలకి, నాయకులకి గెలుపు ఓటములు సహజం. అయితే, 2028లో జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకి పదును పెడుతున్న క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నిక లు ఎప్పుడు జరిగినా తమదే అధికారమని అధికార కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు మళ్లీ బీఆర్‌ఎస్‌కి అవకాశం ఇస్తాయని ఆ పార్టీ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకి అవకాశం ఇచ్చారు కాబట్టి, ఈసారి తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్‌కి అవకాశం ఇస్తారని బీజేపీ ఆశిస్తున్నది. తెలంగాణ ఏర్పాటైన తరువాత మూడు పర్యాయాలు శాసనసభ ఎన్నికలు జరిగితే, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే ముఖాముఖి తలపడ్డాయి. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మూడోపక్షంగా బీజేపీ ఎదగడంతో భవిష్యత్తులో రాష్ట్రంలో మూడు రాజకీయ పక్షాల మధ్య త్రిముఖ పోటీతోపాటు మరికొన్ని చిన్న పార్టీల మూలంగా బహుముఖ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2034 వరకు అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశానికి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్‌ఎస్‌కి వరుసగా రెండు పర్యాయాలు అధికారం ఇచ్చినట్లే కాంగ్రెస్‌కి కూడా రెండవసారి అధికారం కట్టబెడతారని రేవంత్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 2014, 2018లో ఓటమి ఎదురైనా ఆ పార్టీ 24 శాతం, 28 శాతం ఓట్లను సాధించగలిగింది.
2024 లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తన ఓటుబ్యాంకుని 40 శాతానికి పెంచుకొని రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందనడంలో సందేహం లేదు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఖమ్మం, నల్గొండ లాంటి జిల్లాలలో కాంగ్రెస్ సత్తా చాటుతూనే ఉన్న ది. వీటికి తోడు ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్ కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ది.
జాతీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో దళితులు, మైనారిటీలు, రాష్ట్రం లో దశాబ్దాలుగా రాజకీయాలను శాసించే అగ్రవర్ణాలలోని ఒక సామాజిక వర్గం (రెడ్డి) కాంగ్రెస్‌కి బలమైన మద్దతుదారులుగా నిలవడం వల్ల గతంలో ఎన్నడూ గెలవని సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో విజయం సాధించింది.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనకి, రేవంత్‌రెడ్డి పాలనకి పెద్దగా తేడా ఏమీ లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. పాలనా వైఫల్యాలు, గ్యారెంటీలు, హామీలు, అమలు చేయడం లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై ప్రజల లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీసీల నుంచి, రైతు భరోసా విషయంలో రైతుల నుంచి, ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల నుంచి, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో విద్యార్థుల నుంచి, రాజీవ్ యువ వికాసం విషయంలో యువత నుంచి, పెన్షన్ల విషయంలో వృద్ధుల నుంచి, మహాలక్ష్మి పథకం విషయంలో మహిళల నుంచి,
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో రైతు కూలీల నుంచి, డీఏలు, పీఆర్సీల విషయంలో ఉద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలలో ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం తన పాలనా కాలంలో కేసీఆర్‌ను టార్గెట్ చేయడానికి పెట్టిన శ్రద్ధ పాలనపై పెట్టలేదనే అభిప్రాయం ప్రజలలో ఏర్పడటం వలన ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నదనే చెప్పాలి.
ప్రభుత్వ వ్యతిరేకతలపై ఆశలు
తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి ఒక దశాబ్దం పాటు అప్రతిహతంగా తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్ 2023 శాసనసభ ఎన్నికలలో అతి విశ్వాసంతో అనూహ్యంగా ఓటమి చెందింది. శాసనసభ ఎన్నికల ఓటమితో పాటు లోక్‌సభ ఎన్నికలలో ఒక్క స్థానాన్ని కూడా గెలవకపోవడం, బీఆర్‌ఎస్ ఓటుబ్యాంక్ 37 నుంచి 17 శాతానికి పడిపోయింది. దీంతో రాజకీయంగా ఆ పార్టీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానం లో ఉన్నా లోక్‌సభ ఎన్నికలలో మూడో స్థానానికి పడిపోయింది.
కానీ అన్ని ప్రతికూలతలను అధిగమించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 74 వేల పైచిలుకు ఓట్లు సాధించటం, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో మంచి విజయాలు సాధించటంతో ఆ పార్టీ శ్రేణులలో గెలుపుపై నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగా పోరాటం ద్వారా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా మళ్లీ అధికారాన్ని సాధించగలుగుతామనే ఆశలు బీఆర్‌ఎస్ క్యాడర్‌లో చిగురిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ దశాబ్దపు పాలనపై అధికార కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మొదట్లో కొంత వెనుకబడ్డా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకి బీఆర్‌ఎస్ కూడా కొంత ఘాటుగానే స్పందించటం క్యాడర్‌ని ఉత్తేజపరుస్తున్నది. ముఖ్యంగా హరీశ్‌రావు, కేటీఆర్‌లపై ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నా, వారు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
ముఖ్యమంత్రి నేరుగా కేసీఆర్‌పై తరచూ తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా సామాన్య తెలంగాణ ప్రజానీకంలో కేసీఆర్‌పై సానుభూతి వ్యక్తమవుతున్నది. కేసీఆర్ ఇప్పటికీ ప్రజాక్షేత్రంలో క్రియాశీలకంగా వ్యవహరించకపోవడం, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో పార్టీ పరిస్థితి పెద్దగా మెరుగుపడకపోవడం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలలో పార్టీ పూర్వపు బలాన్ని సమీకరించుకోలేకపోవడం, సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడం ఆ పార్టీ బలహీనతలుగా కనిపిస్తున్నాయి.
ఒక్క ఛాన్స్ కోసం బీజేపీ
ప్రయత్నిస్తే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందనే నమ్మకాన్ని 2024 లోక్‌సభ ఎన్నికలు కలిగించాయి. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఎనిమిది స్థానాలలో గెలవటమే కాదు, 35 శాతం ఓట్లతో 46 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ సాధించింది. ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో బలమైన పార్టీగా ఎదిగింది.
కాబట్టి దక్షిణాదికి రాజకీయ ముఖద్వారంగా భావించే తెలంగాణలో అధికారంలోకి రావడం ద్వారా దక్షిణాది లో బలంగా విస్తరించడమే కాదు, కాంగ్రెస్‌ను బలహీనపరచవచ్చని కమలం పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నది. కాబట్టి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ బలంగా కోరుకుంటున్న ది. ఇప్పటికే అధికారంలోకి రావడానికి కావలసిన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లుగా కనపడుతున్నది.
ఇప్పటివరకు తెలంగాణలో బీఆర్‌ఎస్‌కి, కాంగ్రెస్‌కి అవకాశం ఇచ్చారని, తమకు కూడా ఒక్క అవకాశం ఇవ్వాలని, డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ ప్రజలలోకి వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. అయితే, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలలో బీజేపీకి ప్రాతినిధ్యం లేకపోవడం, పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉండటం, రాష్ట్ర నాయకత్వం పాత, కొత్తలుగా చీలిపోవడం బీజేపీ ఆకాంక్షలపై నీళ్లు చల్లుతున్నది.
సత్తా చాటాలని చిన్న పార్టీలు
తెలంగాణ ఏర్పాటైన ఈ పుష్కర కాలం లో ఆంధ్ర మూలాలున్న తెలుగుదేశం, జనసేన, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో పునఃప్రవేశానికి ప్రయ త్నం చేస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన, వామపక్షలు, ఎంఐఎం లాంటి పార్టీలు కూడా రాబోయే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలు మళ్లీ తెరపైకి వస్తున్నట్టే కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో తెలంగాణ రాజకీయ చిత్రపటంపై ఎవరు పైచెయ్యి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారిం ది. అయితే అంతిమంగా విజేతలు ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారు.
వ్యాసకర్త సెల్: 9885465877






