గమ్మత్తున కవితా కిరణాలు
తక్కువ సమయంలో ఎక్కువ భావాన్ని గ్రహించాలనుకునే ఆధునిక పాఠకులకు నానీలు ఒక అద్భుతమైన సాహిత్య విందు. ఈ నానీ ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన, ప్రజాదరణ పొందిన లఘు కవితా రూపం. ప్రక్రియకు ఆద్యుడు ఆచార్య ఎన్.గోపి. ఆయన 1997లో ఈ ప్రక్రియను ప్రవేశపెట్టారు. సంప్రదాయ పద్యాల కంటే భిన్నంగా, ఆధునిక మానవుడి భావాలను తక్కువ మాటల్లో ఎక్కువ లోతుతో చెప్పడానికి ప్రక్రియ ఉపకరిస్తుంది. ఆచార్య గోపి పరంపరను కొనసాగిస్తూ కవి కంచనపల్లి రవికాంత్ ‘నానీ కిరణాలు’ అనే కవితల సంకలనాన్ని వెలువరించారు. మెరుపు తీగల్లాంటి ఈ నానీలను మినీ కవిత్వాన్ని ఇష్టపడే ప్రతి పాఠకుడికి పసందు. సాహితీ మిత్రుల సాం గత్యం ఈ కవికి అదనపు బలం.
తన గురువు ఆచార్య గోపి నుంచి, స్నేహితుడు రఘు నుంచి రవి సాహిత్య పరిమళాలను ఒడిసిపట్టాడు. ‘అబద్ధానిది /మంద బలం /పాపం/ నిజమెప్పుడూ ఒంటరిదే..’ అంటాడు కవి ఒక చోట. అబద్ధానికి చాలామంది మద్దతు ఉంటుంది. కానీ, నిజం మాత్రం ఏ తోడూ లేకుండా, ఒంటరిగా నిలబడాల్సి వస్తుందని కవి నర్మగర్భంగా చాటాడు. ‘ఆత్మీయులందరూ/ పైకెళ్లి పోయారు/ ఇప్పుడు/ మనసే ఒక స్మశానం’ అంటూ కవి మానవ బంధాలకు విలువలు అల్లి భౌతిక ఆవేదనను కుమ్మరించాడు. ‘నిజమెప్పుడూ/ నగ్నంగానే/ ఏ అబద్ధాల ముసుగులూ/ ఉండ వు మరి!’ అంటాడు కవి ఓ చోట.
దీని సారాన్ని వొంపుకుంటే మనలో లోతైన భావన కలుగుతుంది. అబద్ధం బతకాలంటే మోసపూరిత ముసుగులు వేసుకోవాలి. కానీ, నిజం ఎప్పుడూ స్వచ్ఛమైనది, నిర్భీతి కలది. నిజం తనని తాను నిరూపించుకునేందుకు ఎలాంటి అబద్ధపు ముసుగులు, తప్పుడు అలంకారాలు పెట్టుకోదు. నిజమెప్పుడూ నగ్నంగా, స్పష్టంగానే ఉంటుంది. అలాంటి నిత్య సత్యాన్ని రవి తన నానీల ద్వారా జగతికి చాటాడు. వ్యంగ్య విన్యాస చతురతను రవి బాగానే వంటబట్టించుకున్నాడు.
మరెన్నో అనుభూతులు
ఏ కవి అయినా రైతును తలువకుండా ఉండలేడు. అదే విధంగా కవి రవి కూడా రైతులపై కరుణవర్షం కురిపించాడు. ‘నీట మునిగిన/ వరి పంటలు/ కన్నీళ్లతో పెరిగిన/ వరద ఉధృతి ఆహా!’ అంటాడు రవి. కవిలోని కాంతిని కుబుసంగా విడిచిన నానీ ఇది. దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతు దైన్యాన్ని తెలియజేస్తుందీ నానీ. ప్రకృతి కరుణించినా, కోపగించినా నష్టపోయేది రైతు మాత్రమే అనేది కవి భావన.
ఆకాశం నుంచి కురిసే వర్షపు నీటి కంటే, పంటను కోల్పోయిన రైతు కండ్ల నుంచి వచ్చే కన్నీటి ధారలకే ఎక్కువ బలం ఉందనే అంతర్లీన విషయాన్ని చూపిస్తూ ఈ నానీ ఆలోచనల్లో పడేస్తుంది. మరోచోట ‘కందిత్తులు కన్నీటి విత్తులంటూ’.. రైతు విలాపాన్ని వివరిస్తాడు కవి. ‘రంగులమయం/ సిటీ జీవితం/ కూలింగద్దాల మాటున/ కన్నీటి చారికలు’ అంటాడు. నగరం చూడడానికి ఎంత అందంగా రంగులమయంగా ఉన్నా, లోపల మాత్రం ఎందరో మనుషుల నిశ్శబ్ద వేదనలు, ఒంటరితనపు రొదలు ఉంటాయని కవి తన నానీ ద్వారా కళ్లకుకట్టారు. పైకి నవ్వుతూ, ఆధునికంగా కనిపిస్తున్న ప్రతిఒక్కరి జీవితాల వెనుక, చెప్పుకోలేని ఒక కన్నీటి గాథలుంటాయని కవి నర్మగర్భంగా చెప్పారు.
ఇలాంటి నానీలు చదువుతుంటే, ‘రవి గాంచని చోట కవి గాంచును’ అనే నానుడి సరికాదనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ రవి.. ఈ కవి.. రవి గాంచని లోతుల్లోకి వెళ్లి కవిత్వం చెప్తున్నాడు. కవితల సంకలనంలో ఇంకా కరోనా చిలికిన గాయాల సలపరాలు, నగరారణ్య క్రీడలు, బడిగోడల పలకరింపులు, మానవ సంబంధాలపై మరెన్నో కవితలు సంకలనంలో ఉన్నాయి.
గన్నోజు పస్రాద్
సమీక్షకుడు






