అట్టుడికిన సిద్దిపేట
బీఆర్‌ఎస్ X కాంగ్రెస్
- ఒకవైపు ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ సమావేశం
- మరోవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ
- క్షణక్షణం పోలీసులకు టెన్షన్
సిద్దిపేట, ఆగస్టు 20(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, సిద్దిపేటలో బీఆర్‌ఎస్ గెలవడం తో ఇక్కడ పొలిటికల్ వాతావరణం మారిపోయింది. ఈనేపథ్యంలో రైతు రుణమా ఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు, రాజీనామాల డిమాండ్‌తో సిద్దిపేట అట్టుడుకుతోంది. సోమవారం ప్రతి క్షణం టెన్షన్ టెన్షన్‌గా గడిచింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల తీరు పోలీసులకు అగ్ని పరీక్షగా మారింది. ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి సిద్దిపేట ఎమ్మెల్యే క్యాం ప్ ఆఫీసుపై దాడితో మొదలైన అల్లర్లతో ప్రతి రోజు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. 20వ తేదీన సిద్దిపేట లో ర్యాలీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
దీంతో అప్రమత్తమైన బీఆర్‌ఎస్ పార్టీ సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు లో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తామని పోలీసుల అనుమతి తీసుకున్నారు. మంగళవారం కాంగ్రెస్ నిర్వహించిన వాహనాల ర్యాలీ రూట్ మ్యాప్ మారింది. పొన్నాల దాబాల వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నుంచి బీజేఆర్ చౌరస్తా, బైపాస్ రోడు, ఎన్సాన్‌పల్లి చౌరస్తా, భారత్ నగర్, విక్టరీ చౌరసా,్త పాత బస్టాండ్ వద్దకు ర్యాలీకి అనుమతి ఇచ్చారు. అయితే బీజేఆర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ మీదుగా పాత బస్టాండ్ వరకు కాంగ్రెస్ పార్టీ ర్యాలీ ఉంటుందని ఆశించిన కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. బీజేఆర్ చౌరస్తా వద్ద ఒక సైడ్ దారిని మూసివేసి పోలీసు బలగాలు మోహరించాయి.
కాంగ్రెస్ ర్యాలీ ప్రారంభం కాగానే సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఉన్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి, మైనంపల్లి హనుమంత రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని క్యాంపు ఆఫీసులోకి పంపించేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన నిరసనలు మళ్లీ 11సంవత్సరాల తర్వాత రాజకీయ పార్టీల పరస్పర నిరసనలు జరగడంతో జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిరాశగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో మైనంపల్లి హనుమంతరావు మాటల తూటాలు ధైర్యాన్ని నింపాయని చెప్పడానికి ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై జరిగిన దాడి నిదర్శనమని చెప్పవచ్చు.
సిద్దిపేటలో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా రణం కొనసాగుతున్న తరుణంలో ఏ రోజు ఎలాంటి నిరసనలు చేపడుతారోననే సమస్య పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ రెండు పార్టీల లొల్లితో సిద్దిపేటలో ప్రశాంతత లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి.






