హరీశ్‌ది రాక్షసపాలన
- సిద్దిపేట.. నీ అయ్య జాగీరా
- మా కార్యకర్తలను రాళ్లతో కొట్టమన్నడు
- ఇకపై నీ ఆటలు సాగవనివ్వం
- హరీశ్ రావుపై మైనంపల్లి ఫైర్
సిద్దిపేట, ఆగస్టు 20 (విజయక్రాంతి): సిద్దిపేటలో హరీశ్ రావు రాక్షస పాలన సాగుతోందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ధ్వజమెత్తారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని హరీశ్ రావుకు తెలియ దా అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులో అప్పటి సీఎం కేసీఆర్ ఫోటో పెట్టిన సంగతి హరీశ్‌కు గుర్తు లేదా అని ప్రశ్నించారు. హరీశ్ ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేక బీఆర్‌ఎస్ ప్రత్యేక రాష్ట్రంలోని అధికారంలో ఉన్నావా అంటూ విమర్శించారు.
నీ తుక్కు పెట్టె పట్టుకుని రెడీగా ఉండాలని సూచించారు. ఇటీవల జరిగిన ఫ్లెక్సీల వార్‌లో కాంగ్రెస్ కార్యకర్తలపై కారం పొడి చల్లి, రాళ్లతో కొట్టాలని హరీశ్ పిలుపునిచ్చినట్టు బీఆర్‌ఎస్ కార్యకర్తలే తనకు స్వయంగా ఫోన్ చేసి చేప్పారని తెలిపారు. ‘అందుకే హరీశ్ రావును అడుగుతున్న.. సిద్దిపేట.. నీ అయ్య జాగీరా.. నీన్ను సిద్దిపేట నుంచి సాగనంపుతమాం’ అంటూ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశారని, నీవు చేసిన సవాల్‌ను స్వీకరించి రాజీనామా చేయాలని సూచించారు. హరీశ్ రాజీనామా చేస్తే ఆయన మీద తానే పోటీ చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలలో హరీశ్ రావు లేదా మైనంపల్లి ఎవరో ఒకరే ఉండాలని వ్యాఖ్యానించారు.
సిద్దిపేటలో ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతావా అంటూ హరీశ్‌కు సవాల్ విసిరారు. సిద్దిపేట కాంగ్రెస్ కార్యాకర్తలకు తాను ఉన్నానని, ఏ ఒక్కరికీ ఆపద వచ్చినా, హరీశ్ రావు ఇబ్బంది పెట్టినా తక్షణమే తాను ఇక్కడ వాలుతానని, అందరూ ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రె స్ కార్యాకర్తలు ఏనాడు మీ ఫ్ల్లెక్సీను చించలేదని, ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ఫ్ల్లెక్సీలను చించివేసేందుకు బరి తెగించిందన్నారు. ఇక నుంచి సిద్దిపేటకు తరుచుగా తాను వస్తానని, తమ పార్టీ కార్యకర్తలను ముట్టుకోవాలంటే బీఆర్‌ఎస్‌కు వెన్నులో భయం పుట్టాలన్నారు. బీఆర్‌ఎస్ నాయకులను, కార్యకర్తలను హరీశ్ అణగదొక్కాడని ఆరోపించారు.
తాము బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ నైతికంగా మీకే మద్దతు ఇస్తామని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తనకు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఇక నుంచి సిద్దిపేటలో హరీశ్ రావు ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. ఇంకా తమ పార్టీ అధికారంలో ఉన్నదనే భ్రమలోంచి హరీశ్ రావు బయటకు రావాలని హితవు పలికారు. రుణమాఫీపై అనుమానాలు ఉన్న రైతులకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దగ్గరుండి అవసరమైన సేవలందించాలని సూచించారు.
సిద్దిపేటలో జరిగిన ఫ్లెక్సీల వార్‌లో భాగంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ రహదారిపై పొన్నాల దాబాల వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ బీజేఆర్ చౌరస్తా, బైపాస్ రోడ్, ఎన్సాన్‌పల్లి చౌరస్తా మీదుగా భారత్ నగర్, విక్టరీ చౌరస్తా నుంచి పాత బస్‌స్టాండ్ వరకు సాగింది. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






