calender_icon.png 9 July, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ గడ్డపై ఉద్యోగుల సైరన్

08-08-2024 12:00:00 AM

తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర కీలకమైంది. ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒకెత్తయితే... సకల జనుల సమ్మె మరో ఎత్తు. ఆనాటి ఉద్యమ నాయకులు కేసీఆర్, కోదండరాంలు కరీంనగర్ గడ్డ నుంచే సకల జనుల సమ్మె సైరన్ మోగించి ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. 2011 సెప్టెంబర్ 12న కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన ‘జనగర్జన సభ’ ఉద్యోగులను సమ్మెబాట పట్టించేలా చేసింది. 42 రోజులపాటు సాగిన ఈ సమ్మె తెలంగాణ భావజాలాన్ని జేఏసీ తారస్థాయికి తీసుకెళ్లింది. అప్పటి ప్రభుత్వం దిగిరాకపోవడంతో 2011 సెప్టెంబర్ 6న సకల జనుల సమ్మెకు దారితీసింది.

కరీంనగర్ జిల్లా నుంచి 12,500 మంది ఉపాధ్యాయులు, 12 వేల మంది ఎన్‌జీవోలు, 800 మంది గెజిటెడ్ ఆఫీసర్లు, 8 వేల మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, 18 వేల మంది సింగరేణి కార్మికులు ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఉద్యోగులతోపాటు విద్యార్థులు, కవులు, కళాకారులు సబ్బండ వర్ణాలు కదంతొక్కాయి. బడిపిల్లలు రోడ్డెక్కారు. న్యాయవాదులు కోర్టులు బహిష్కరించారు. వైద్యులు ఆస్పత్రులకు తాళాలు వేసి ఉద్యమాన్ని ఉరకలెత్తించారు.  సెప్టెంబర్ 12 అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజులు చరిత్రలో నిలిచిపోయే విధంగా కరీంనగర్ ఉద్యోగులు పోరాడారు. 

తెలంగాణ వచ్చిన తృప్తి లేదు

తెలంగాణ సాధించామన్న సంతోషం ఉద్యోగుల్లో కొద్దిరోజులే మిగిలింది. అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించడం ద్వారా ఉద్యోగుల విభజన జరిగింది. కానీ అందుకు తగ్గట్టుగా ఉద్యోగుల భర్తీ జరగకపోవడంతో ఉద్యోగులు స్థానిక ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు బదిలీ అయి పనిభారం పెరిగి ఇబ్బందులు పడ్డారు. డీఏలు, పీఆర్సీ, వేతనాలు, సకాలంలో అందక ఆందోళనకు గురయ్యారు. 317 జీవో ద్వారా భార్యాభర్తలు ఒకచోట పనిచేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ నాలుగు సంవత్సరాల డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ట్రెజరీ ద్వారా వేతనాలు రాని పరిస్థితి నెలకొంది.  ఎన్‌జీవోల ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది. కారుణ్య నియామకాలు తప్ప కొత్త ఉద్యోగాలు రాని పరిస్థితి ఈ పదేళ్లలో ఏర్పడింది. 

ఉద్యోగులకు న్యాయం చేయాలి

రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సినవి అందిస్తే ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. ప్రతి ఆరు నెలలకొకసారి రావాల్సిన డీఏ సక్రమంగా అందించాలి. నాలుగు సంవత్సరాలుగా డీఏలు చెల్లించలేదు. 12 నెలలకొకసారి అందించాల్సిన ఇంక్రిమెంట్, మూడు నుంచి నాలుగు సంవత్సరాలకొకసారి పీఆర్సీ అమలు చేయాలని మేం కోరుకుంటున్నాం. నెలనెలా జీతాలు ఒకటో తేదీన ట్రెజరీ ద్వారా అందిస్తే బాగుంటుంది.  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల పట్ల కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. 

 దారం శ్రీనివాస్ రెడ్డి, 

టీఎన్‌జీవో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు

ఉద్యోగుల పాత్ర చారిత్రాత్మకం

తెలంగాణ సాధన కోసం కరీంనగర్ ఉద్యోగులు నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకమైనది. ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఉద్యోగులకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్లను మా రాష్ట్ర నాయకులు ఇప్పటికే ప్రభుత్వం ముందుంచారు. తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్త ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా వేగవంతం చేసి పనిభారం తగ్గించాలి. 

  సంగెం లక్ష్మణ్‌రావు, 

టీఎన్‌జీవో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి