08-08-2024 12:05:00 AM
ఓరుగల్లు అంటే కళల కాణాచి మాత్రమే కాదు.. ఉవ్వెత్తున ఎగిసిపడే పోరాటాలకు బావుటా కూడా. తొలి, మలి ఉద్యమాలకు ప్రాణం పోసింది ఓరుగల్లు జిల్లా అయితే.. ఆ ఉద్యమాన్ని ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేదాకా కొనసాగించింది కాకతీయ విశ్వవిద్యాలయం. మహాగర్జన, పొలికేక లాంటి చారిత్రాత్మక పోరాటాలతో తెలంగాణ ఉద్యమాలను మలుపు తిప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కలికితురాయిగా నిలిచారు కాకతీయ విద్యార్థులు. ఆనాటి జ్ఞాపకాల్లోకి ఒకసారి వెళ్తే ఎన్నో బలిదానాలు.. పోరాటాలు మన కళ్లముందు నిలుస్తాయి.
హనుమకొండ, విజయక్రాంతి :
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పొలికేక తొలిసారి వినిపించింది ఇక్కడే. తొలి ఉద్యమం ప్రారంభమైంది కూడా ఇక్కడే. మలి ఉద్యమానికి ఊతమి చ్చింది కూడా ఈ పోరాటాల పురిటిగడ్డ నుంచే. కాకతీయ విశ్వవిద్యాలయం కేంద్రంగా ఉద్యమం ఉధృతంగా సాగింది. ఫలితంగా తెలంగాణ ఉద్యమానికి సబ్బండ వర్గాలు వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమానికి ఊపిరిలూదిన కాకతీయ యూనివర్సిటీ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమికి పోషించింది.
ఉద్యమం పురుడుపోసుకుందిలా..
2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం కాకతీయ విశ్వవిద్యాలయంలోనే పురుడు పోసుకుంది. అప్పటి ఉద్యమ పార్టీలు.. జేఏసీల ఆధ్వర్యంలో సాగిన ఉద్యమంలో ఓరుగల్లు జిల్లా ప్రజలు ఉద్యమానికి ఊపిరిపోశారు. ఫలితంగా 2009 నవంబర్ 29న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిరాహారదీక్ష ఉద్యమానికి కొత్తరక్తం ఎక్కించినట్లయింది. తెలంగాణలోని అన్ని జిల్లాల కన్నా మిన్నాగా వరంగల్ జిల్లా ఉద్యమంలో అగ్రభాగాన నిలిచింది. రోడ్లపై వంటావార్పు.. మహిళలు బతుకమ్మల ఊరేగింపులు.. ర్యాలీలు.. రాస్తారోకోలతో ఉద్యమాన్ని హోరెత్తించారు.
అయితే ఈ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉద్యమాన్నే పాఠ్యాంశంగా స్వీకరించారు. తెలంగాణ బాధలనే సిలబస్‌గా చదువుకున్నారు. విద్యార్థులంతా ఒకేతాటిపైకి వచ్చి ఉద్యమబాటలో నడవడంతో విద్యార్థి జేఏసీ సంఘాలు ఏర్పాటయ్యాయి. 2010 ఫిబ్రవరి ఏడున కేయూ క్యాంపస్‌లో జరిగిన పొలికేక ఓ చారిత్రాత్మక ఘట్టం. ఆ సభ ద్వారా వేలాది మంది ఉద్యమ నినాదాన్ని చాటారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు.. స్వామి అగ్నివేశ్, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ విద్యార్థులను ముందుండి నడిపించారు.
దీంతో ఉద్యమం మరింత ఉరకలేసింది. మన తెలంగాణ పండుగలు బోనాలు.. బతుకమ్మ కూడా స్వరాష్ట్ర ఏర్పాటును చాటిచెప్పాయి. వివిధ రూపాలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించి ప్రపంచ దేశాలు ఓరుగల్లు చూసేలా ఆశ్చర్యంలో ముంచెత్తారు. కళాకారులు గ్రామగ్రామాన దూందాం కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలన ఉద్యమం వైపు నడిపించారు. దీంతో తెలంగాణ భావజాలం వ్యాప్తి చెంది చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో చెప్పగలిగే స్థాయికి ఎదిగారు.
మలుపు తిప్పిన మానుకోట
2010 మే 16న జరిగిన మానుకోట ఘటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది. ఉద్యమ ఉధృతికి ఉత్ప్రేరకంగా మారింది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మైలురాయిలా నిలిచింది. ఆ రోజు వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను మహబూబాబాద్ నుంచిప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్‌లో సమైక్య ప్లకార్డులు ప్రదర్శించిన జగన్ తెలంగాణలో కాలుమోపనివ్వమని రాజకీయ జేఏసీతో పాటు టీఆర్‌ఎస్, పలు విద్యార్ధి సంఘాలు హెచ్చరికలు జారీ చేవాయి. జగన్‌ను అడ్డుకునేందుకు తెంగాణవాదులు చెరోవైపు మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో మోహరించారు.
ఉద్యమకారులను సమైక్యవాదులు రెచ్చగొట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. రెండువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమైక్యవాదుల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి కంకర రాళ్లను ఆయుధాలుగా చేసుకొని ఉద్యమకారులు ప్రతిఘటించారు. దీంతో మానుకోట రైల్వేస్టేషన్ రణరణంగా మారింది. పరస్పర దాడుల్లో సమైక్యవాదుల గన్‌మెన్ల కాల్పులకు 15 మంది తెలంగాణ వాదులు, రాళ్లదెబ్బలకు మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగింది.
పోరుబాట నుంచి ప్రత్యేక రాష్ట్రందాకా..
కాకతీయ విశ్వవిద్యాలయంలో మొదలైన పోరుబాట తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరక ఆగలేదు. ఉద్యమమే ఊపిరిగా బతికిన ఉద్యమకారులెందరో స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా బలితీసుకున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మాహుతి చేసుకున్నారు. రైళ్లకు ఎదురెళ్లి ‘జై తెలంగాణ’ అంటూ ప్రాణాలు బలితీసుకున్నారు. 1969లో ఉద్యమంలో వరంగల్ జిల్లాలో 119 మంది బలైతే... మలిదశ ఉద్యమంలో 362 మంది ప్రాణాలు త్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పది జిల్లాల్లో మొత్తం 1250 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే కేవలం ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా ప్రాణత్యాగం చేశారు. చివరికి 2013 డిసెంబర్ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.
కదంతొక్కిన కేయూ
కేయూ ఉద్యమ స్ఫూర్తితో కవులు, రచయితలు తమ సాహిత్యం ద్వారా ఉద్యమానికి మరింత ఊపిరిపోశారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి ఉద్యమాల్లో కేయూ విద్యార్థిలోకం విజయవంతం చేసింది. 2010 డిసెంబర్ 16న ప్రకాశ్‌రెడ్డిపేటలో నిర్వహించిన మహాగర్జన సభకు సుమారు 25 లక్షల మంది ప్రజలు భాగమయ్యారు. ఈ మహాసభ గిన్నిస్‌బుక్ రికార్డులకెక్కి వరంగల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా చేసింది. మహాగర్జన తెలంగాణ ఉద్యమ చరిత్ర పుటల్లో చెరగని మహోజ్వల ఘట్టంగా నిలిచిపోయింది. 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు 42 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెలో యావత్ జిల్లా ప్రజానీకం భాగస్వామ్యమైంది.
అటు అమరుల త్యాగం, ఇటు సాంస్కృతిక చైతన్యం, మరో వైపు పరిపాలన స్థంభన ఉద్యమ ఉధృతికి ఎంతో దోహదపడింది. వివిధ ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, కర్షకులతో ఏర్పడిన జేఏసీలు ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపించాయి. జేఏసీల ఏర్పాటు తర్వాత తెలంగాణ ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటి జాక్‌ను ఏర్పాటు చేసి మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులే. విద్యార్థుల ఉద్యమ ఫలితంగానే అన్ని జిల్లాల్లో జేఏసీల ఏర్పాటయ్యాయి.
తెలంగాణవాదాన్ని బలంగా వినిపించా..
విద్యార్థి దశలోనే నేనే ఉద్యమాలు చేశా. తెలంగాణ ఉద్యమం నన్ను బాగా కదిలిచింది. వరంగల్ విద్యార్థులతో కలుపుకొని పెద్ద ఉద్యమ సభ పెట్టిన. మా ఉద్యమాలు, పోరాటాలు చూసి కేసీఆర్ సైతం ప్రభావితమై ఓరుగల్లు సభకు వచ్చాడు. అప్పుడు ఫస్ట్ స్పీకర్ నేను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు మూడుసార్లు జైలుకు వెళ్లా. 45 రోజులు జైలుకు వెళ్లి కుటుంబ సభ్యులను దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పట్లోనే శ్రీ కృష్ణ కమిటీ ముందు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించా. కేవలం నా మీదనే 150పై గా కేసులున్నాయి. ఒకసారి లాఠీచార్జి జరిగితే కోమాలోకి విషమ పరిస్థితులు ఎదుర్కొన్నా.
డాక్టర్ వలి ఉల్లా ఖాద్రీ,
ఉద్యమ నాయకుడు
కొట్లాడినందుకు నక్సలైట్ ముద్రవేశారు
మహిళలు అయినా మేం పురుషులతో సమానంగా ఉద్యమం చేసి కొట్లాడినం. మా కళ్లెదుట బలిదానాలు జరుగుతున్నా.. పోరాటం చేయడం ఆపలేదు. 2009 సమయంలో విరోచితంగా ఉద్యమాలు చేస్తే.. నాపై నక్సలైట్ అని ముద్ర వేశారు. ఉద్యమంలో భాగంగా ఇనుప కంచెలు వేస్తే.. హాస్టల్ గొడలు దూకి ఉద్యమాలు చేసిన. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినా.. మాకు న్యాయం జరగలేదు. మేం పెద్ద పెద్ద పోస్టులు అడగలేదు. అన్నీ అర్హతలు ఉండి నామినేటేడు పోస్టు లు అడిగితే అన్యాయమే చేశారు. ఉద్యమంలో ఫ్యామిలీ లైఫ్‌ను కోల్పో యా. ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేయకపోతే.. మళ్లీ తెలంగాణలో ఉద్యమం వస్తుంది. నాపై అసెంబ్లీ ముట్టడి కేసు ఇప్పటికీ ఉంది.
క్రిష్ణలత, అడ్వకేట్
విద్యార్థులు లేనిది.. ఉద్యమమే లేదు
ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినా.. విద్యార్థుల పాత్ర కచ్చితంగా ఉంటుంది. విద్యార్థులు లేకుంటే ఉద్యమాలు లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం పడిపోవడానికి కారణం నిరుద్యోగుల పాత్రే ముఖ్య కారణం. ఆనాడు తెలంగాణలో ఉద్యమంలో కూడా ఓయూ, కేయూ విద్యార్థుల పాత్ర వెలకట్టేలేనిది. అప్పటి ఉమ్మడి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ పేరుతో వరంగల్ జిల్లాకు వస్తే.. తెలంగాణ నినాదాన్ని నావంతుగా వినిపించా. ఫలితంగా నా మీద పోలీసులు కేసులు పెట్టి జైలుపాలు చేశారు. నీళ్లు, నిధుల కోసమే కాకుండా ఉద్యోగాల కోసం జరిగింది. అందుకే ఎక్కడా ఉద్యమం జరిగినా వెళ్లేవాడ్ని. ఆనాడు నిరుద్యోగు లు ఉద్యమాలు చేశారు కాబట్టే రాష్ట్రం సాధ్యమైంది.
దుర్గం సారయ్య, కేయూ ఉద్యమకారుడు