18 March, 2026 | 2:45 AM

ఫాంహౌస్ కేసుపై సిట్

18-03-2026 01:07 AM

డీసీపీ యోగేశ్ గౌతమ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన సర్కారు

  1. ఆ పార్టీ వెనుక భారీ బిజినెస్ డీల్? 
  2. పార్టీ ముసుగులో దుబాయ్ కనెక్షన్లు 
  3. రోహిత్‌రెడ్డి, నమిత్‌శర్మల కస్టడీకి రంగం సిద్ధం

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 17 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తు న్న మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ప్రభుత్వం మంగళవారం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో మొత్తం 9 మందితో ఏర్పాటు చేసింది. ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేసి 3 నెలల్లోగా ఛార్జ్‌షీట్ దాఖ లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ బృందంలో ఎం రవీందర్‌రెడ్డి (గ్రూప్ కమాండర్, గ్రేహౌండ్స్), సిహెచ్ సిరిషా (డీసీపీ, షాద్‌నగర్), బుచ్చయ్య (డీఎస్పీ, ఈగల్ ఫోర్స్), హరీష్‌చంద్రరెడ్డి (డీఎస్పీ, ఈగల్ ఫోర్స్), వై మల్లికార్జునరెడ్డి (ఎస్సై, మోయినాబాద్), కోటేశ్వరరావు (మోకి లా పోలీస్ స్టేషన్ ఎస్సై), వెంకన్న (మొయినాబాద్ ఎస్సై), సదాత్ అలీ (శంషాబాద్‌బాద్ ఎస్సై) ఉన్నారు. ఈ క్రమం లో కేవలం మాదకద్రవ్యాల సేవనమే కాకుండా, ఈ పార్టీ వెనుక ఏదైనా భారీ ఆర్థిక లావాదేవీ లేదా బిజినెస్ డీల్ ఉందా అనే కోణంలో సిట్ అధికారులు లోతుగా కూపీ లాగుతున్నారు. 

గంటలపాటు విచారణ..

సిట్ అధికారులు మంగళవారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ కేంద్రంగా విచారణను ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటికే స్టేషన్ బెయిల్ పొందిన ఎనిమిది మంది నిందితులను పిలిపించి, గంటల తరబడి విడివిడిగా విచారించారు. పార్టీకి సంబంధించిన ప్రతి చిన్న సమాచారాన్ని సేకరిస్తూ, నిందితుల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర, అంతర్జాతీ య ఆర్థిక సంబంధాలను వెలికితీసే పనిలో పడ్డారు. 

బెంగళూరు నుంచి అడ్వకేట్లు, ఢిల్లీ నుంచి రియల్ ఎస్టేట్  వ్యాపారులు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ, తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యే.. ఇలా వివిధ రాష్ట్రాల వ్యక్తులు ఒకే చోట చేరడం వెనుక ఏదో పెద్ద కుట్రే ఉండి ఉంటుందని సిట్ భావిస్తోంది. ఏదైనా వివాదాస్పద సెటిల్మెంట్ లేదా భారీ భూమి లావాదేవీలకు సంబంధించిన చర్చలు జరిగాయా.. అనే అంశంపై సిట్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా బెంగళూరు అడ్వకేట్ కౌశిక్ రవి ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు తేలడంతో, ఆ నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించిందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

మరోవైపు, కేసులో ప్రధాన నిందితుడు నమిత్ శర్మకు సంబంధించిన దుబాయ్ లింకులపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఢిల్లీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నమిత్ శర్మకు దుబాయ్ లోని అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే పక్కా సమాచారంతో అధికారులు విచారణ సాగిస్తున్నారు. డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చే నల్ల ధనాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెట్టి తెల్లగా మారుస్తున్నారా.. అనే కోణంలో నిందితుల బ్యాంక్ ఖాతాలను, ఐటీ రిటర్న్స్‌ను అధికారులు జల్లెడ పడుతున్నారు.

కాల్ డేటా విశ్లేషణలో నిందితుల ఫోన్ల నుంచి విదేశీ నంబర్లకు పలుమార్లు సంభాషణలు జరిగినట్లు తేలడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది.  మంగళవారం జరిగిన విచారణలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఎనిమిది మందిని సిట్ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

పార్టీకి మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు, అక్కడ డ్రగ్స్ ఉన్న విషయం మీకు ముందే తెలుసా, నిందితుల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏమిటి వంటి అంశాలపై వారి నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను తమ కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులు త్వరలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.