27 June, 2026 | 6:52 AM

వాసుదేవరెడ్డి కారులో 6 కిలోల బంగారం బిల్లులు

14-06-2024 01:03 AM

ఏపీ హైకోర్టుకు నివేదించిన సీఐడీ

విజయవాడ, జూన్ 13 (విజయక్రాంతి): సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ సీఎల్) మాజీ ఎండీ వాసుదేవరెడ్డి వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. సీఐడీ వ్యతిరేకిస్తున్న కారణంగా ముందస్తు బెయిల్ ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందజేయాలని సీఐడీని ఆదేశించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. సీఐడీ వాదనల విన్న తర్వాతే ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తగిన ఉత్తర్వులు జారీ చేయగలమని న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం వెల్లడించారు.

ఏపీఎస్బీసీఎల్ కార్యాలయం నుంచి ఆ సంస్థ ఫైళ్లు, డాక్యుమెంట్లు, కంప్యూటర్ పరికరాలను వాసుదేవరెడ్డి కారులో తీసుకెళుతుంటే చూ శానంటూ కంచికచర్లకు చెందిన గద్దె శివకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ నెల 6న కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ సీనియర్ కౌన్సి ల్‌గా ప్రభుత్వం నియమించిన సీనియర్ అడ్వొకేట్ పోసాని వెంకటేశ్వర్లు విచారణకు హాజరై.. వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని కోరారు.

ఐపీసీ సెక్షన్లు 409, 467, 471 కింద కూడా కేసు నమోదు అయ్యాయని చెప్పారు. సోదాలు జరిగిన రోజున పిటిషనర్ ఢిల్లీలో ఉన్నారని, వాసుదేవరెడ్డి మామ, బావ మరిది ఇళ్లలో కూడా సోదాలు జరిగాయన్నారు. వాసుదేవరెడ్డి కారులో కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. కారులో రూ.4 కోట్ల విలువ చేసే 6 కేజీల బంగారం 2023లో కొనుగోలుకు చెందిన బిల్లులు కూడా దొరికాయని చెప్పారు.  వాదనల తర్వాత ముందస్తు బెయిల్ మంజూరుకు నిరాకరించిన హైకోర్టు, తదుపరి విచా రణను ఈ నెల 18కి వాయిదా వేసింది.