కుల, మత రహిత రికార్డుల తయారీపై కౌంటరు దాఖలు చేయండి:హైకోర్టు
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): పాఠశాలల్లో ప్రవేశాలు, బదిలీ సర్టిఫికెట్లల్లో కుల,మత ప్రస్తావనలు లేకుండా చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే గడువు ఇచ్చామని, మరోసారి వాయిదా కోరవద్దని చెప్పింది. మూడు వారాల్లో దాఖలు చేయాలంది. తదుపరి విచారణను జులై 2వ తేదీకి వాయిదా వేసింది. పాఠశాల అడ్మిషన్, బదిలీ సర్టిఫికెట్లలో తల్లిదండ్రుల కులం, మతం వివరాలు పేర్కొనాలనే నిబంధనను కొట్టివేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన డీవీ రామకృష్ణ, మరొకరు 2017లో పిల్ దాఖలు చేశారు.
దీనిని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె అనిల్‌కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారించింది. ఇప్పటికే కేంద్రం కౌంటరు దాఖలు చేస్తూ జనాభా గణన సమయంలో కుల, మతాలవారీగా సేకరించిన గణాంకాలు పాఠశాల రికార్డుల్లో ఉపయోగపడవని తెలిపింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పిం ది. కౌంటర్ వేసేందుకు మళ్లీ గడువు కావాలని రాష్ట్రం తరఫున అదనపు అడ్వొకేట్ జనర ల్ కోరారు. ఇందుకు చివరిసారిగా అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు ప్రకటించి విచారణను జులై 2వ తేదీకి వాయిదా వేసింది.






