16 March, 2026 | 9:10 AM

మత్తులో డ్రైవింగ్.. ఆరుగురికి జైలు శిక్ష

11-11-2025 12:00 AM

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 50 మందికి కోర్టు జరిమానాలు 

కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని కట్టడి చేసేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిత్యము జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో సైతం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నారు. మద్యం ప్రియులు మాత్రం మత్తు వినడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న వాహనదారులు మాత్రం కొందరు మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నారు.

సోమవారం కామారెడ్డి కోర్టులో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 44 మందికి వెయ్యి రూపాయల చొప్పున ఒక్కొక్కరికి జరిమానాలను విధించారు. మరో ఆరుగురికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానతో పాటు ఒకరోజు జైలు శిక్ష ను విధించారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిత్యం జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారు పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా కట్టడి చేసేందుకు కోర్టుకు హాజరుపరచడం జైలు శిక్ష వేయించడంతోపాటు జరిమానాలు విధించడం చేపడుతున్న మద్యం ప్రియులు మాత్రం మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. శిక్షలు అనుభవిస్తున్నారు.