5 August, 2026 | 8:57 PM

నైపుణ్యాలే విద్యుత్ రంగానికి కొత్త వెలుగు

05-08-2026 08:04 PM

– టెక్నాలజీకి అనుగుణంగా టెక్నీషియన్లు ముందుకెళ్లాలి

– టీజీఆర్‌డీసీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి

ఎల్​బీనగర్​: తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ జేఏసీ ఆధ్వర్యంలో కర్మన్‌ఘాట్‌లోని శిల్పి గ్రాండ్‌లో బుధవారం నిర్వహించిన టెక్నికల్ సెమినార్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీజీఆర్‌డీసీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  విద్యుత్ రంగంలో సేవలందిస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములని పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేపథ్యంలో కొత్త టెక్నాలజీకి అప్​డేట్​ కావడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన విద్యుత్ సేవలు అందించేందుకు నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ధి అవసరమని చెప్పారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు సంఘటితంగా అసోసియేషన్ ద్వారా ముందుకు వస్తే వృత్తికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమర్థవంతంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని మల్‌రెడ్డి రాంరెడ్డి అన్నారు.

ప్రతి టెక్నీషియన్ వైర్‌మ్యాన్ లైసెన్స్ పొందేందుకు చర్యలు తీసుకోవాలని, దీంతో అధికారికంగా విద్యుత్ పనులు, కాంట్రాక్టులు నిర్వహించే అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, విద్యుదాఘాతంతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని రూ.8 లక్షలకు పెంచడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ల సమస్యలను కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క యాదగిరి, తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీసీ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు నేమాల బెనర్జీ, వై. వెంకటేశ్వర్లు, గ్రేటర్ అధ్యక్షుడు పొదిల గోవర్ధన్, ఏఎంసీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు రమాకాంత్ గుప్తా , సునీల్ బాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్రామ్ రెడ్డి, మాజీ టెంపుల్ డైరెక్టర్ కిరణ్  , జేఏసీ రాష్ట్ర నాయకులు కొండ బాల్‌రెడ్డి, శ్రావణ్ కుమార్, వివిధ జిల్లాల ప్రతినిధులు లక్ష్మణ్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.