5 August, 2026 | 9:42 PM

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

05-08-2026 08:39 PM

ఎగువ మానేరు పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలకు తెలియజేయాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఎగువ మానేరు ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితె

గంభీరావుపేట,(విజయక్రాంతి): ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద నీటి పారుదల, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ ను బుధవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం, ఎగువ నుంచి వరద తదితర అంశాలపై జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.

ఎగువ మానేరు ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి ఇన్ ఫ్లో లేదని, ప్రాజెక్టు పూర్తి  స్థాయి నీటి మట్టం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1. 6 టీఎంసీల నీరు ఉందని నీటి పారుదల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఎగువ మానేరు ప్రాజెక్ట్ లోకి వరద చేరి పూర్తి స్థాయి నీరు నిండే అవకాశం ఉందని, నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నీటి మట్టాన్ని పరిశీలిస్తూ.. ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల రైతులు, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ మత్తడి పారితే పోలీస్, రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి.. రాకపోకలను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, ప్రశాంత్, తహసీల్దార్ మారుతి, సర్పంచ్ అర్చన తదితరులు పాల్గొన్నారు.