5 August, 2026 | 9:29 PM

గొర్రెల మందపైకి దూసుకెళ్లిన కారు

05-08-2026 08:52 PM

14 గొర్రెలు మృతి, మరో 10కు గాయాలు

చివ్వెంల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని అక్కలదేవిగూడెం గ్రామ శివారులో నేషనల్ హైవే-365బీబీపై బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై వెళ్తున్న గొర్రెల మందపైకి AP39KB0880 నంబర్ గల కారు అతివేగంగా దూసుకెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన గొర్రెలను సురక్షిత ప్రాంతానికి తరలించి చికిత్స అందించే ప్రయత్నాలు చేపట్టారు.

ఈ ప్రమాదంతో గొర్రెల యజమానికి రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనాధారమైన గొర్రెలను కోల్పోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని, ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదానికి కారు అతివేగమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.