బద్ధకిస్తున్న భూమి
- భూమి లోపలి పొరల భ్రమ వేగం తగ్గుతోంది
- ఫలితంగా రోజు నిడివి తగ్గే అవకాశం
- తాజా అధ్యయనంలో వెల్లడి
- భూకంపాల తరంగాల్లో గుర్తించిన శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, జూన్ 15: సాధారణంగా రోజుకు ఎన్ని గంటలని అడిగితే ఎవరైనా చెప్పేది 24 అని. అయితే, ఇప్పుడీ సమాధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఇటీవల విడుదలైన ఓ అధ్యయనం పేర్కొంది. రోజు నిడివిలో సెకన్‌లో కొంత భాగం తగ్గే అవకాశం ఉందని ఈ పరిశోధన గుర్తించింది. ఇందుకు కారణం 2010 నుంచి భూమి లోపలి పొర తిరిగే వేగం తగ్గడమే ఇందుకు కారణమని వివరించింది. భూమి లోపలి పొరలు ఇనుము, నికెల్ వంటి ద్రవ లోహాలతో కూడి ఉంటుంది. దీనిపైన దృఢమైన లోహపు పొర ఉంటుంది. ఈ రెండు పొరలు, మాంటిల్, క్రస్ట్‌తో కలిపి భూమికి మొత్తం మూడు పొరలు ఉంటాయి. ప్రస్తుతం వీటి భ్రమణ వేగంలోనే మార్పు వచ్చినట్లు నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం తెలిపింది.
భిన్న పరిశోధనలు..
సాధారణంగా భూమి లోపలి అంశాలు మనకు భౌతికంగా అందుబాటులో ఉండవు. అందువల్ల కోర్‌లో జరిగే మార్పులను సీస్మోగ్రామ్‌లు, భూకంపాల ద్వారా వచ్చే తరంగాలను విశ్లేషించడం ద్వారా అధ్యయనం చేస్తారు. 1991 నుంచి 2023 మధ్య దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని శాండ్‌విచ్ దీవుల్లో ఒకే ప్రదేశంలో సంభవించిన 121 భూకంపాల డాటాను తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు పరిశీలించారు. విశ్లేషణలో 1971 మధ్య సోవియట్, ఫ్రాన్స్, అమెరికా అణు పరీక్షల డాటాను పరిశోధించారు. ఈ మార్పులను సూచించిన సీస్మోగ్రామ్‌లను మొదటిసారి చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయా. కానీ, తర్వాత పదుల సంఖ్యలో అదే నమూనాలను పరిశీలించినప్పుడు ఇది కచ్చితమైన ఫలితంగా గుర్తించాం. వందల ఏళ్ల తర్వాత మొదటిసారిగా కోర్ వేగం మందగించింది అని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్త జాన్ విడేల్ తెలిపారు.
సెకన్ తొలగిస్తే..
ఒకవేళ నిజంగానే ఈ పరిణామం వల్ల తగ్గిన సెకనును తొలగించాల్సి వస్తే ఏమవుతుందిలే అనుకోవడానికి లేదు. ఇది ముఖ్యంగా టెక్నాలజీ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు జీపీఎస్ వంటి సాంకేతికత సరిగా పనిచేయాలంటే కచ్చితమైన సమయం అవసరం. సెకను తగ్గింపు హార్డ్‌వేర్ కంపెనీలకు తలనొప్పిగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టైమర్ల ఆధారంగా పనిచేసే సాఫ్ట్‌వేర్ మీద భారీ ప్రభావమే చూపుతుందని ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతమున్న చాలా కంప్యూటర్ సర్వర్లు 32 బిట్ రూపంలో తేదీని, సమయాన్ని నిల్వ చేసుకునే ఒకే వ్యవస్థను వాడుకుంటున్నాయి. ఇది 1970 జనవరి 1 నుంచి సెకండ్ల ప్రకారం లెక్కించుకుంటూ వస్తోంది. దీన్నే ఎపోక్ టైంగా పేర్కొంటారు. అందువల్ల ఒక సెకండ్‌ను తొలగిస్తే సర్వర్ల పనితీరు దెబ్బతినవచ్చు. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగవచ్చు.
విభిన్న వాదనలు..
అయితే, ఈ అంశం శాస్త్రవేత్తల సమూహంలో కొంత వివాదాస్పదంగా ఉంది. కొందరు కోర్ వేగం తగ్గుతోందని ప్రదిపాదిస్తుంటే మరికొన్ని అధ్యయనాలు ఉపరితలం కంటే వేగంగా భ్రమిస్తోందని చెబుతున్నారు. మరికొందరు భూభ్రమణ వేగం పెరుగుతోందని, అందువల్ల రోజులో ఒక సెకన్ తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి లోపలి కోర్ చివరి లేయర్‌లో ఉత్పన్నమయ్యే అయస్కాంత క్షేత్రం.. భూమి మాంటిల్‌లోని గురుత్వాకర్షణ శక్తి వల్ల ప్రభావితమవుతుంది. ఫలితంగా ప్రస్తుత అధ్యయనం ప్రకారం.. గత 40 ఏళ్ల డాటాను చూస్తే మొదటిసారి కోర్ వేగం తగ్గిందని, అందువల్ల లోపలి కోర్ వెనక్కుతగ్గుతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.






