జీ-7 లోనూ భారతీయ ముద్ర
- అడుగడుగున భారత్‌కు ప్రాధాన్యం
- రోజంతా వివిధ దేశాల అధినేతలతో చర్చల్లో బిజీబిజీ
- ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన ప్రధాని
అపులీయా (ఇటలీ), జూన్ 15: ఇటలీలో జరుగుతున్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని, చర్చలు ఫలప్రదంగా జరిగాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. మూడు రోజుల సదస్సులో మొదటిరోజు హాజరైన మోదీ శనివారం తెల్లవారుజామున ఢిల్లీకి బయలుదేరారు. జీ-7లో సభ్యదేశంగా లేని భారత్‌ను ఆతిథ్య దేశమైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో వరుసగా 11వ సారి ప్రధాని జీ-7 సమావేశాలకు హాజరుకావడం విశేషం. మోదీ తన పర్యటనలో భాగంగా వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలతో రోజంతా బిజీగా గడిపారు.
ఈ సందర్భంగా పర్యటనలో విశేషాలను వివరిస్తూ మోదీ ట్వీట్ చేశారు. అపులీయాలో జరిగిన జీ-7 సమ్మిట్‌లో ఈ రోజు ఎంతో ఉత్పాదకమైనది. ప్రపంచ నాయకులను కలిసి వివిధ అంశాలపై చర్చించా. అంతర్జాతీయ సమాజానికి ప్రయోజనం చేకూరే ప్రభావవంతమైన పరిష్కారాలను మేమంతా కలిసి గుర్తించాం. భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇటలీ ఇచ్చిన సాదరమైన ఆతిథ్యానికి ఆ దేశ ప్రజలతో పాటు ప్రభుత్వానికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
పోప్‌కు ఆహ్వానం
పర్యటనలో భాగంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతలతో పాటు ప్రముఖులతో మోదీ భేటీ అయ్యారు. పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన మోదీ ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. భారత్‌లో పర్యటించాలని పోప్‌ను ఆహ్వానించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రస్‌ను కలిసి మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తుర్కియే ప్రెసిడెంట్ ఎర్డోగాన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా 2, యూఏఈ కింగ్ మహ్మద్‌బిన్ జాయేద్, బ్రెజిల్ ప్రెసిడెంట్ లుయిజ్ ఇనాసియో లులా డసిల్వా, జర్మన్ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కాల్జ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అంతేకాకుండా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతోనూ మోదీ కరచాలనం చేశారు. కొన్ని రోజులుగా రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూ వస్తున్న నేపథ్యంలో ట్రూడోను మోదీ కలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
జపాన్ ప్రధానితో..
జపాన్ ప్రధాని పుమియో కిషిదాతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య పదేళ్లుగా కొనసాగుతున్న వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామం మరింత పెంచేందుకు ఇరు నేతలు అంగీకరించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్యంలో బీ2బీ, పీ2పీ, జీ2జీ విధానాల్లో పరస్పర సహకారం అందించాలని నిర్ణయించారు. రక్షణ, హైస్పీడ్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌లో బదలాయింపునకు చర్చించారు.
మళ్లీ మెలోడి సెల్ఫీ
జీ-7 సదస్సులో మరోసారి మెలోడి మూమెంట్ మళ్లీ ట్రెండింగ్‌గా మారింది. సమావేశాలు పూర్తయిన తర్వాత మోదీతో ఇటలీ ప్రధాని మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీ వీడియోను మెలోనీ ఎక్స్ ఖాతాలో పంచుకుని హాయ్ ఫ్రెండ్స్, ఫ్రమ్ మెలోడి క్యాప్షన్ ఇచ్చారు. మోదీ, మెలోనీ ఇద్దరు పేర్లు కలిసేలా ఆమె మెలోడి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన కాప్‌న సదస్సులోనూ వీరిద్దరి సెల్ఫీ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అప్పుడూ మెలోడి పదాన్ని మెలోనీ జతచేశారు. అప్పటి నుంచి ఈ పదం ట్రెండ్ అయింది. మెలోనీతోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.






