06-12-2025 08:37:11 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం (మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్స్, ఏఐసీటీఈ) నిర్వహించే 8వ "స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025" జీహెచ్ఎంసీ ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని ఏసీఈ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. హ్యాకథాన్ కు సంబంధించిన వివరాలను ఏసీఈ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. సుధాకర్ రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. దేశవ్యాప్తంగా వివిధ సాంకేతిక విద్యా కళాశాలల నుంచి 20 బృందాలు చొప్పున ఈస్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో తమ నైపుణ్యాన్ని పరీక్షించుకోనున్నారని తెలిపారు.
ఈనెల 8వ తేదీన ఉదయం ప్రారంభమైన 9వ తేదీ రాత్రి వరకు దాదాపు 36 గంటల పాటు విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పరిరక్షించుకునేందుకు పోటీ పడతారని చెప్పారు. పవర్ గ్రిడ్, మ్యాథ్ వర్క్స్ సంస్థలు ఇచ్చేటువంటి సాంకేతిక సమస్యలపై విద్యార్థులు పరిశీలన చేసి పరిష్కారాన్ని కనుక్కోవడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలో ప్రతిభను చాటుకున్న మూడు టీంలకు రూ. 4.5 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల స్వయం ఉపాధి కోసం, కొత్త స్టార్టప్లకు కేంద్ర ప్రభుత్వంతో పాటు, ప్రైవేట్ సంస్థలు సహకారం అందిస్తాయని తెలిపారు.
అంతేకాకుండా హ్యాకథాన్ లో పాల్గొన్న విద్యార్థులతో దేశ ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ హ్యాకతాన్ లో పాల్గొనే విద్యార్థుల కోసం ఏసీఈ ఈ ఇంజనీరింగ్ కళాశాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కళాశాల డైరెక్టర్ పి. మమతారావు, హెచ్ఓడి ప్రొఫెసర్ ఎం.వి. సారధి, ఎం. కొండలరావు వై. విజయ్ కుమార్ పి. సాయినాథ్ పాల్గొన్నారు.