30 April, 2026 | 1:29 AM

బీసీలకు సామాజిక అన్యాయం

30-04-2026 12:00 AM

పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు  (2023) ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% సీట్లు కేటా యిస్తారు. అయితే, ఈ రిజర్వేషన్లు అమ లు కావడానికి ప్రభుత్వం రెండు ప్రధాన షరతులను పెట్టింది. కొత్తగా జనగణన జరగాలి. ఆ జనగణన నివేదిక ఆధారంగా డీలిమిటేషన్ ( నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియ పూర్తి కావాలి. అయితే, ఈ షరతులను తుంగలో తొక్కి కేంద్రం మరోసారి మహిళా రిజర్వేషన్ల పేరిట డీలిమి టేషన్‌తో ముడిపెడుతూ మరో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.

ఈ నేపథ్యంలో ఎన్డీయే భవిష్యత్ లో రాజకీయ లబ్ధిపొందడానికి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టిందనే కారణంతో ప్రతిపక్షాలు ఈ నూతన బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకించాయి. దీంతో మహి ళా రిజరేషన్ల అమలు మళ్లీ మొదటికొచ్చింది. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షి ణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది ప్రతిపక్షాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వాదన. ఇందులో వాస్తవం ఉంది. దీనికి ప్రధాన కారణం జనాభా నియంత్రణ. సా ధారణంగా నియోజకవర్గాల సంఖ్య జనాభా ప్రాతిపదికన పెరు గుతుంది.

గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, త మిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు జనాభా నియంత్రణను విజయవంతంగా అ మలు చేశాయి. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రా ల్లో జనాభా విపరీతంగా పెరిగింది. ఒకవేళ కొత్త జనాభా లెక్కల ప్రకారం లోక్ సభ సీట్లు పెంచితే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు భారీగా పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయి. దీనివల్ల ఢిల్లీలో తమ ప్రాధాన్యం తగ్గుతుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు భయాం దోళనలు వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం డీలిమిటేషన్ చేస్తే లోక్‌సభ సీట్లు 850కి పెరుగుతాయి. ఇప్పటికే దక్షిణాదిలో బీజేపీ ఓటుబ్యాంకు చాలా తక్కువగా ఉంది. కాబట్టి, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే దక్షిణాదిలో బీజే పీ, దాని మిత్రపక్షాలకు పెద్దగా సీట్లు రాకు న్నా ఆ పార్టీకి ఇబ్బంది ఉండదు. కేంద్రం లో అధికారం చేపట్టేందుకు ఒక్క ఉత్తరాదిలో వచ్చే సీట్లు బీజేపీకి సరిపోతాయి. కాబట్టి, దక్షిణాదికి అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ, భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగాలని మోదీ వ్యూహాలు రచిస్తున్నారని చెప్పవచ్చు.

మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు అంతర్గత రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, ఓబీసీ మహిళలకు ప్రత్యేక ఉప కోటా కేటాయించలేదు. దీనిపైనే ప్రతిపక్షాలు, మేధావులు, విశ్లేషకులు మండిపడుతున్నారు. బీసీ కోటా లేకపోతే, రాజకీయంగా ఇప్పటికే బలంగా ఉన్న అగ్రకుల మహిళలే ఈ 33% రిజర్వేషన్లను అందిపుచ్చుకుంటారు. తద్వారా అ గ్రకుల పురుషాధిపత్యానికి తోడుగా అగ్రకుల స్త్రీల అధిపత్యమూ రాజకీయాల్లో పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ‘వెనుకబడిన కులాల మహిళలకు’ అసలు ప్రాతిని ధ్యమే దక్కకపోవచ్చు.

అయినా సామాజిక న్యాయం లేని మహిళా రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు? అగ్రకుల మహిళా నాయకత్వాన్ని పెంపొందించడానికా? దేశంలో కులగణన చేపట్టి, జనాభా దామాషా ప్రకారం బీసీ మహిళలకు వాటా ఇవ్వాలని ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. స్వా తంత్య్రానంతరం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం మూలంగా బీసీల రాజకీయ వాటా అగ్రకుల నాయకులే అ నుభవిస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి చట్టాలు చేయాల్సిన చారిత్రక అవసరం ఉంది. ఇది బీసీలకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిది ద్దేందుకు రాజ్యాంగబద్ధ హక్కుగా చూడాలి.

బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్‌లో రాజకీయ రిజర్వేషన్ ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్లు తీసుకురావడం అంటే మహిళల భుజాలపై తుపాకి పెట్టి సమాజంలో సింహభాగం ఉన్న ఓబీసీలను రాజకీయ హత్య చేయడమే. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం అంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలను అమలు చేయడమే. అయితే, బీసీ మహిళలకు ఉప కోటా లేకపోయినా తమ రాజకీయ మనుగడ కోసం ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఎన్డీయేకు మద్దతిస్తున్నారు. తద్వారా బీసీ మహిళల రాజ్యాంగబద్ధ హక్కుల పట్ల ఏపీ పాలక, ప్రతిపక్ష నేతలకు నిబద్ధత లేదని వారు నిరూపించుకుంటున్నారు.

ఉత్తరాది విభేదాలు రాకుం డా, సామాజిక న్యాయం జరగాలంటే ప్రభుత్వం ఈ కింది చర్యలు తీసుకోవాలి. జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా, రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక క్రమశి క్షణ, అక్షరాస్యత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లేదా, దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గకుండా ఉండేలా పార్లమెంట్ సీట్ల సంఖ్యను భారీగా పెంచి, వెయిటేజీ పద్ధతిని అనుసరించాలి. లేకుంటే దక్షిణాది రాష్ట్రాలు గత 50 ఏళ్ల నుంచి జనాభా నియంత్రణ పాటించినందుకు, కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక పన్నులు చెల్లిస్తూ దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించినందుకు శిక్షించినట్టు అవుతుంది.

అన్ని వర్గాల మహిళలకు సామాజిక న్యాయం జరగాలంటే బిల్లులో సవరణలు చేసి బీసీ మహిళలకు తప్పనిసరిగా ఉప కోటా ఇవ్వాలి. త్వరగా జనగణన పూర్తిచేసి రిజర్వేషన్లు అమలు చేయాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా, రాబోయే కొత్త జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధిచేకూరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

మహిళా రిజర్వేషన్లు ఒక వర్గానికే పరిమితం కాకుండా, అన్ని కులాల మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే అది నిజమైన ‘ప్రజాస్వామ్య విజయం’ అవుతుంది. డీలిమిటేషన్ బిల్లును, మహిళా రిజర్వేషన్ల బిల్లును వేరువేరుగా ప్రవేశపెట్టి, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహి ళలకు ఉపకోటా కేటాయిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది. అంతిమంగా తమ రాజకీయ స్వలాభం కోసం డీలిమిటేషన్ చేయకుండా, మహిళా రిజర్వేషన్లు అమలుచేస్తే దేశంలోని ఏ రాష్ట్రానికి, ఏ వర్గానికి అన్యాయం జరగకుండా సామాజిక న్యాయం చేసినట్టు అవుతుంది.

ఇదే తరుణంలో ఓబీసీ రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం దేశంలో యుద్ధ ప్రాతిపదికన బీసీ నాయకులు ఇతర ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులను, అగ్రకుల ప్రజాస్వామ్యవాదులను కలుపుకొని బలమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ నాయకులు, ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షకు లు, మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు సైతం గ్రహించాల్సిన చారిత్రక సత్యం ఇది.

వ్యాసకర్త సెల్: 9553041549

పుల్లెంల గణేష్