28 May, 2026 | 1:32 AM

తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలి

28-05-2026 01:02 AM
  1. ప్రభుత్వ అసమర్థత వల్లే రైతన్నలకు ఈ దుస్థితి
  2. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి
  3. పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. అకాల వర్షాలతో నష్ట పోయిన రైతులకు అండగా ఉండాలని బుధవారం ఒక ప్రకటనలో ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ ఆపత్కాలంలో రైతన్నలకు భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు పలు మార్కెట్ యార్డుల్లో వడ్లు వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నలు కన్నీరుమున్నీరు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేక సెల్‌ఫోన్ల వెలుతురులో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు.

ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే నేడు రైతన్నలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్లే రైతుల ఆరుగాలం కష్టం కళ్లముందే నీళ్లపాలవుతోందని ధ్వజమెత్తారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతాంగానికి అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులన్నీ క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తక్షణమే తమ తమ పరిధిలో అకాల వర్షాల వల్ల ప్రభావితమైన అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు.

ప్రతి రైతుకు పార్టీ తరఫున అండగా నిలవాలని, పూర్తి మద్దతు, సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. రైతుల పక్షాన నిలబ డి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా, రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. తడిసిన వరి, మొక్కజొన్న తదితర ధాన్యాన్ని తేమ శాతం, తరుగు లాంటి ఎలాంటి సాకులు చెప్పకుండా బేషరతుగా కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అలాగే వెంటనే మార్కెట్ యార్డులలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి, మిగిలిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లను తక్షణమే అందుబాటులో ఉంచాలన్నారు. ‘రైతు కంటతడి పెడితే ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదు‘ అని పేర్కొన్న కేటీఆర్.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని హెచ్చరించారు.