28 May, 2026 | 1:43 AM

మృత్యు కుహరాలుగా ట్రాన్స్‌ఫార్మర్లు!

28-05-2026 01:05 AM
  1. ఫెన్సింగ్ లేదు.. ఫ్యూజ్ బాక్సులు తెరిచే.. 
  2. నాగోల్, కొత్తపేటలో కాలనీ వాసుల గుండెల్లో గుబులు
  3. వైర్లు నేలకు తాకుతున్నా పట్టించుకోని వైనం 
  4. ప్రమాదం జరగకముందే స్పందించాలని ప్రజల డిమాండ్

నాగోల్, మే 27 (విజయక్రాంతి): జనసమ్మర్థం ఉన్న కాలనీలు.. నిత్యం వందలాది మంది తిరిగే రహదారులు.. కానీ ఎటు చూసినా అడుగుతీసి అడుగు వేయాలంటేనే భయం పుట్టించేలా వేలాడుతున్న విద్యుత్ వైర్లు, తెరిచి ఉన్న ఫ్యూజ్ బాక్సులు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని నాగోల్, కొత్తపేట్ డివిజన్లలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రస్తుతం మృత్యుపాశాలుగా మారి స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏ వైరు తెగిపడుతుందో, ఎప్పుడు ఏ ఫ్యూజ్ బాక్స్ నుంచి షార్ట్సర్క్యూట్ అవుతుందో తెలియక కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

 రక్షణ కరువై.. ప్రమాదాల ముంగిట

నాగోల్, కొత్తపేట్ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అస్తవ్యస్తతకు అద్దం పడుతోంది. మమతానగర్ ఇక్కడ రెండు ట్రాన్స్ఫార్మర్లు పక్కపక్కనే ఉండి కాలనీవాసులకు నిత్య ముప్పుగా మారాయి. వీటికి కనీస రక్షణ వలయం (ఫెన్సింగ్) కూడా లేకపోవడంతో పాటు, ఫ్యూజ్ బాక్సులు పూర్తిగా తెరిచి ఉన్నాయి.జైపూర్ కాలనీ జంక్షన్లో ఇక్కడి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెట్ల పొదలు దట్టంగా పెరిగిపోయాయి. ఇవి వైర్లకు తగులుతుండటంతో ఏ క్షణమైనా షార్ట్సర్క్యూట్ జరిగే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్తపేట్ కూరగాయల మార్కెట్ జంక్షన్ నిత్యం వందలాది మంది వచ్చే ఈ మార్కెట్ జంక్షన్లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎలాంటి రక్షణ చర్యలు లేవు. దీనికి సరిగ్గా ఆనుకునే చిరు వ్యాపారులు వ్యాపారాలుచేసుకుంటుండటంతో, అటు వ్యాపారులు, ఇటు పాదచా రులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తిరుగుతున్నారు.

నాగోల్ డీమార్ట్ సమీపం ఇక్కడి ఫుట్పాత్పే విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. దీని పక్కనే బస్ షెల్టర్ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఆనంద్నగర్ చౌరస్తా ఇక్కడ ఫ్యూజ్ బాక్స్ వైర్లు ఏకంగా నేలను తాకుతున్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో షార్ట్సర్క్యూట్ సంభవించి వాహనాలు దగ్ధమైన ఘోర ఘటన జరిగినప్పటికీ, అధికారులు మాత్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

గత చేదు అనుభవాలు కళ్లముందు ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించక ముందే ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకో వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం: 

ఈ సమస్యపై  నాగోల్ బండ్లగూడ విద్యుత్ శాఖ ఏఈ క్రాంతి కిరణ్ వివరణ కోరగా సానుకూలంగా స్పందించారు.నియోజకవర్గ పరిధిలో రక్షణ వలయాలు (ఫెన్సింగ్) లేని ట్రాన్స్ఫార్మర్లను వెంటనే గుర్తించి, యుద్ధప్రాతిపదికన ఫెన్సింగ్ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే ప్రమాదకరంగా మారిన ఫ్యూజ్ బాక్సులను తక్షణమే తొలగించి, కొత్తవి ఏర్పాటు చేస్తూ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

- క్రాంతి కిరణ్

ఏఈ , నాగోల్ బండ్లగూడ