మరోసారి ఔదార్యం చాటుకున్న తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్
సరోజిని వృద్ధాశ్రమానికి రూ.5 లక్షలతో సోలార్ విద్యుత్ ఏర్పాటు
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు మరోసారి ఔదార్యం చాటుకుంది. భద్రాచలంలోని సరోజిని వృద్ధాశ్రమానికి రూ.5లక్షల వ్యయంతో 10కెవి సోలార్ విద్యుత్తు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గతంతోలనే ఆశ్రమం భవనం నిర్మించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసి తమ మంచి మనసును చాటుకున్నారు.
ట్రస్టు చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య మనవడు ప్రవాస భారతీయులు తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ - నీలిమ దంపతుల కుమారుడు సాయిపంచాక్షర్ తన మొదటి నెల వేతనం నుంచి రూ.5 లక్షల వ్యయంతో 10కెవి సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయించారు. సాయిపంచాక్షర్ చిన్నతనం నుంచే సమాజసేవపై తనకు ఉన్న మక్కువను చాటుకున్నారు. తమ సొంతగడ్డ మీద అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతను అందిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తును శనివారం లాంఛనంగా ప్రారంభించారు.
ఆశ్రమానికి భారీ వితరణ అందించిన ట్రస్టు బాధ్యులకు ఆశ్రమం నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్- నీలిమ దంపతులు, తాళ్లూరి ట్రస్టు డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ, బూర్గంపాడు పీఏసీఎస్ మాజీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, భద్రాచలం సర్పంచి పూనెం కృష్ణ, అడుసుమిల్లి జగదీశ్, పల్లంటి దేశప్ప, మోతుకూరి వీరయ్య, బొడ్డపాటి రామారావు, చావా లక్ష్మీనారాయణ, జలగం చంద్రశేఖర్, ఆశ్రమం నిర్వాహకులు సరోజిని తదితరులు పాల్గొన్నారు.




