8 June, 2026 | 4:53 PM

కొనుగోలు నిలిపినా.. కొనుగోలు కేంద్రంలో దళారుల హవా

08-06-2026 03:24 PM

ఇంద్రవెల్లి మార్కెట్ యార్డులో కొనసాగుతున్న జొన్నలకు కొనుగోలు..

ఉట్నూర్,(విజయక్రాంతి): రబీ సీజన్లో రైతులు సాగుచేసిన  జొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వం  మద్దతు దొరకు కొనుగోలు కోసం ముందుకు వచ్చింది.. రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశంతో  ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో  వ్యాపారులదే హవా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  ఈనెల ఆరవ తేదీ వరకు  రైతులు తీసుకువచ్చిన  జొన్న పంటలను కొనుగోలు చేయాలని  ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల ఆరవ తేదీ రాత్రి వరకు జొన్న పంటలను కొనుగోలు చేసింది. జొన్న కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసే అధికారులు ఒక అడుగు ముందుకేసి  వ్యాపారులు తీసుకువచ్చిన  జొన్న పంటలను, వ్యాపారుల మద్దతు  పలికే రైతుల పేరుతో నేటికీ కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

ఇంద్రవెల్లి మార్కెట్ యార్డ్ పరిధిలోని  వివిధ గ్రామాలకు చెందిన రైతులు తీసుకువచ్చిన 25 వేల  900 కింటాలను జొన్న పంటలను  కొనుగోలు చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  శనివారం రాత్రి వరకు పంటలు కొనుగోలు చేయాలని  ఆదేశాలు ఇచ్చినా.. వారి ఆదేశాలను  బేకతారు చేస్తూ  రైతుల పేరుతో వ్యాపారులు తీసుకువచ్చిన జొన్న పంటలు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. సోమవారం ఉదయం  మార్కెట్ యార్డ్ లోకి వ్యాపారులకు చెందిన  జొన్న వాహనాలను  అనుమతి ఇచ్చి  వాటిని  యార్డ్  లో చేశారు. కొంతమంది రైతులు తమ వద్ద ఉన్న జొన్న పంటను మార్కెట్ యార్డ్ కు  తీసుక వస్తే  ఈనెల ఆరవ తేదీన  కొనుగోలు నిలిపివేశామని, జొన్నల కొనుగోలు చేయడం లేదని  కేంద్రం ఇన్చార్జి అధికారులు  తెలపడంతో నిరాశతో  రైతులు వెన్ను తిరిగి వెళ్లారు.  అధికారుల ఆదేశాల మేరకు ఈనెల ఆరో తేదీ వరకు  25వేల తొమ్మిది వందల క్వింటాళ్ల జొన్నలు  కొనుగోలు చేసిన తర్వాత రెండు రోజుల్లో మరో ఐదు వేల క్వింటాళ్ల జొన్నలను  కొనుగోలు చేసినట్లు ఆన్లైన్లో రికార్డులు నమోదు చేశారు.

మార్కెట్ యార్డులో  రైతులు తీసుకువచ్చిన  జొన్న పంటలు నిలవలను  తూకం చేసి  కొనుగోలు చేసినట్లు కొనుగోలు కేంద్రం ఇంచార్జి  తుమ్మల సునీల్ తెలిపారు. అధికారుల  ఆదేశాల మేరకు  బయట నుంచి వచ్చిన జొన్నలను  కొనుగోలు చేయడం లేదని, యార్డులో రైతులు నిలువ ఉంచిన జొన్న పంటను తూకం వేస్తున్నామని కొనుగోలు కేంద్రం ఇంచార్జి తెలిపారు. ఇంద్రవెల్లి మార్కెట్ యార్డ్ పరిధిలో  జొన్నల కొనుగోలు కేంద్రంలో రైతుల పేరుతో వ్యాపారులు విక్రయించిన  జొన్న పంటలపై  క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే  ప్రభుత్వానికి నష్టం కల్పించే వ్యాపారులు బయటకు వస్తారని  రైతులు అంటున్నారు.

వేసవిలో కనీసం తాగేందుకు నీళ్లు దొరకని గ్రామాల్లో సైతం  రబ్బి సీజన్లో జొన్న పంటలు సాగు చేసినట్లు  వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో  నమోదు చేయడం వెనుక ఉన్న కారణాలేంటియో  అర్థం కావడం లేదని  రైతులు అంటున్నారు. సాగునీటి సౌకర్యం లేని  రైతులు సైతం  జొన్న పంటలు సాగు చేసినట్టు  వ్యవసాయ శాఖ అధికారులు రైతుల పేర్లను  ఆన్లైన్లో నమోదు చేశారని , వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలపై క్షేత్రస్థాయిలో  విచారణ జరిపిస్తే అసలు విషయం బయటకు పడుతుందని  రైతులు అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు  ఆ దిశగా  క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని  రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతుల పేరుతో వ్యాపారుల అమ్మకం: చక్కటి మాణిక్ రావు, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్

 ఇంద్రవెల్లి మార్కెట్  యార్డులో  మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో  పిఎసిఎస్  కొనుగోలు చేస్తున్న జొన్నల కొనుగోలు కేంద్రంలో రైతుల పేరుతో వ్యాపారులు తీసుకువచ్చిన  జొన్నలు కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ కమిటీ డైరెక్టర్ చాకటి మాణిక్ రావు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం తో జొన్నల కొనుగోలు నిలిపి వేశారని  అన్నారు. అధికారికంగా నిలిపివేసిన జొన్నల కొనుగోలు కేంద్రంలో  ఆదివారం, సోమవారం ఉదయం వ్యాపారులు తీసుకోవలసిన వాహనాలను  లోనికి తీసుకొని  జొన్న సంచులను ఖాళీ చేయించారని  అన్నారు. కొనుగోలు కేంద్రం ఇన్చార్జి  సునీల్ ని సైతం  హెచ్చరించిన పట్టించుకోవడంలేదని  తెలిపారు. తనకు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయని  అందుకే కొనుగోలు చేస్తున్నామని అంటున్నారని మాణిక్ రావు అన్నారు. ఇంద్రవెల్లి లోని  జొన్నల కొనుగోలు కేంద్రం పై  పూర్తిస్థాయి విచారణ జరిపితే  దళారులు, వ్యాపారులు, వారికి మద్దతు పలికిన రైతులు బయటకు వస్తారని  మాణిక్ రావు అన్నారు.