8 June, 2026 | 2:53 PM

సైట్ రాక.. సర్టిఫికెట్ల జారీ ఆలస్యం

08-06-2026 01:50 PM

తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తల్లిదండ్రుల ప్రదక్షిణలు

బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయంలో(Bejjanki Tahsildar Office) కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల (కాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లు) జారీ ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితమే దరఖాస్తులు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు సర్టిఫికెట్లు అందడం లేదని వారు వాపోతున్నారు.

సోమవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన పలువురు తల్లిదండ్రులు తమ సమస్యలను వివరించారు. సర్టిఫికెట్ల గురించి ఆరా తీస్తే "సిట్ (SIT) రాలేదు", "ఇంకా ప్రక్రియ పూర్తికాలేదు" అనే సమాధానాలు మాత్రమే చెబుతున్నారని ఆరోపించారు. విద్యా ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ఇతర ప్రభుత్వ పథకాల కోసం ఈ ధ్రువీకరణ పత్రాలు అత్యవసరమైన సమయంలో జాప్యం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

అంతేకాకుండా, కార్యాలయానికి వచ్చిన ప్రజలకు కొందరు సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రశ్నిస్తే బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని కొందరు తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రజల సమస్యలను ఓర్పుతో విని పరిష్కరించాల్సిన అధికారులు, సిబ్బంది స్పందన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని, కార్యాలయంలో ప్రజలకు మర్యాదపూర్వక సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.