16 July, 2026 | 11:29 AM

సిల్లీగా అనిపించింది!

16-06-2024 12:05 AM

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కల్కీ2898ఏడీ’. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం భాగస్వామ్యమైంది. ఈ సినిమా ఇదే నెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ ఆసక్తికర విషయాలు చెప్పారు. “నేను దర్శకుడిగా మారి తక్కువ కాలమే అవుతోంది. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ వంటి వారిది ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల ప్రస్థానం. అలాంటి ఎంతో మంది పెద్ద స్టార్స్ ‘కల్కి’లో నటించారు. అంతటి గొప్ప నటులకు నేను సీన్స్ వివరించటం సిల్లీగా అనిపించింది. ఈ సినిమా కోసం తొలి సన్నివేశాన్ని అమితాబ్‌తో తీశాను.

ఆయన ఇందులో మంచి పోరాట సన్నివేశాల్లో కనిపిస్తారు. అమితాబ్, కమల్ హాసన్‌లు ఎంత ఎత్తుకు ఎదిగినా నేర్చుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. అదే వాళ్ల గొప్పతనం” అని వివరించారు నాగ్ అశ్విన్. ఇంకా ‘ప్రభాస్, దీపికా పదుకొణెలకు ఉన్న స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకొని, అభిమానులకు వాళ్ల నుంచి ఏం కావాలో అలానే చూపించాను. ఈ చిత్రాన్ని పన్నెండేండ్ల పిల్లలు కూడా ఇష్టపడేలా తీశాను. యాక్షన్ సన్నివేశాలను పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపారాయన. మరోవైపు, ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘బుజ్జి’ వాహనం దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం జైపూర్‌లో ఉందీ కార్. ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్‌ను మేకర్స్ ఇచ్చారు. ‘భైరవ యాంథమ్’ పేరుతో ఓ సాంగ్ రెడీ చేశారు. ఫుల్ సాంగ్ ఆదివారం రానుండగా, ప్రోమోను శనివారం విడుదల చేశారు మేకర్స్. సినిమాలో ఈ సాంగ్ కథలో అంతర్భాంగా ఉండనున్నదట. ఈ సాంగ్‌కు సంబంధించి ప్రమోషనల్ వీడియోలో ప్రభాస్.. పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజేతో కలిసి కనిపించనున్నాడు.