ముందుగానే నైరుతి
- ౧౪న అండమాన్ నికోబార్‌కు రుతు పవనాలు
- నెలాఖరులోపు కేరళం తీరానికి చేరిక
- జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలకు..
- సమృద్ధిగా వానలు కురిసే అవకాశం
న్యూఢిల్లీ, మే ౨: నైరుతి పవనాలు చల్లటి కబురు చెప్పాయి. సాధారణ అంచనా కంటే ఈసారి ముందుగానే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకుంటున్నట్లు భారత వాతావరణశాఖ (ఐఎండీ)కు సంకేతాలిచ్చాయి. ఐఎండీ అంచనా ప్రకారం.. రుతు పవనాలు ఈనెల 14 16 మధ్య అండమాన్ నికోబార్ దీవుల ను తాకే అవకాశం ఉంది. దీంతో ఈసారి వానాకాలం ముందుగానే వస్తుందని, సమృద్ధిగా వానలు కురిసే అవకాశం ఉందనేది తేలి పోయింది. అండమాన్ తాకిన తర్వాత మరో ౧౦ ౧౫ రోజులకు పవనాలు కేరళంను తాకనున్నాయి. అదే జరిగితే ఆ రాష్ట్రంలోవర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈక్రమంలో రుతు పవనాలు జూన్ మొదటి వారంలోనే కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి ప్రవేశిస్తాయి.
నెలాఖరుకు ఉత్తరాదికి చేరుకుంటాయి. జూలై మొదటి వారం నుంచి దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలి వీచే సరళి, బంగాళాఖాతం, అరేబియన్ సముద్ర జలాల్లో ఏర్పడే అల్పపీడన ప్రభావాలతో రుతుపవనాలు వాటి దిశను మార్చుకుం టాయని, ఈ క్రమంలో కొన్నిసార్లు తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణాది, పశ్చిమ భారతంలో అధిక వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేసింది.
కానీ, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదయ్యే సూచనలున్నాయని వివరించింది. ఏదేమై నా నైరుతి రుతు పవనాల రాకతో దేశవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. వేడి మి, ఉక్కపోతల నుంచి ప్రజలకు కొంత మేర ఉపశమనం కలుగుతుంది.






