28-10-2025 12:42:32 AM
ఆదిలాబాద్, బోథ్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రైతులు పండించిన సోయాబీన్ పంటను అమ్మకానికి మార్కెట్ యార్డ్ లకు తీసుకువచ్చిన ఇంకా కొనుగోలు ప్రారంభించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనలకు దిగారు. బేల మండల కేంద్రంలో సోయాబీన్ రైతులు ఎదుర్కొంటు న్న సమస్యలపై మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం నిరసన చేపట్టారు.
రైతులతో కలిసి బేల జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో పట్టడంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది. మార్కెట్ కు తీసుకొచ్చిన సోయా పంటను చూయిస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. దీంతో మార్కెట్ అధికారులు, పోలీసులు వచ్చి ఆం దోళనకారులను సముదాయించిన ఫలితం లేకపోవడంతో చాలాసేపు నిరసన కొనసాగింది.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ... సోయా కొనుగోళ్ల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సోయి లేదని మండిపడ్డారు. మార్కెట్ అధికారులు సోమవారం సొయా కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పి మాట తప్పడంతో రైతులు ఇబ్బందులకు గురిఅవుతున్నారన్నారు. తక్షణం కొనుగోలు ప్రారంభించకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు దద్దమ్మలే అని ఆరోపించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అన్నారు. ప్రకృతి విపత్తులతో అధిక వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులకు ధైర్యాన్ని ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. తేమ శాతం లేకుండా సోయా, పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే జిల్లా రైతాంగా సమస్యల కంటే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ముఖ్యమైందా అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రౌతు మనోహర్, ప్రమోద్ రెడ్డి, సతీష్ పవార్, గంభీర్ ఠాక్రే, విపిన్, కుమ్రా రాజు, రాజన్న, సతీష్, తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సోనాలలో రోడ్డుపై వంటావార్పు
రైతులు పండించిన సోయాబీన్ పంట కొనుగోలు చేయాలంటూ సోనాల మండల కేంద్రంలో సైతం బీఆర్‌ఎస్ శ్రేణులు రైతులకు అండగా ఆందోళనకు దిగారు. బోథ్ మండల మాజీ అధ్యక్షులు తుల శ్రీనివాస్ నేతృత్వంలో సోమవారం రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అనంతరం రోడ్డుపైనే వంటావార్పు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఈ సందర్భంగా తుల శ్రీనివాస్ మాట్లాడుతూ సొనాల మండల కేంద్రంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ పూర్తయి నెలరోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యనికి నిదర్శనం అని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు రైతులు, బీఆర్‌ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.