28-10-2025 12:41:50 AM
‘ ఎంపీ రఘునందన్ రావు
దౌల్తాబాద్,అక్టోబర్ 27: మండలంలోని హైమద్నగర్ తిరుమల మిల్లులో సోమవారం సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను అందజేయడం ద్వారా వారి కష్టానికి సరైన విలువ లభించేలా చర్యలు తీసుకుంటోందన్నారు. సీసీఐ కేంద్రాల్లో రైతుల పత్తిని నేరుగా కొనుగోలు చేస్తారని రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యాపారుల దోపిడీకి గురికావద్దన్నారు.
మద్దతు ధర కంటే తక్కువకు పత్తిని అమ్మే పరిస్థితి రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.రైతులు సీసీఐ నియమ నిబంధనలు పాటిస్తూ తమ పత్తిని కేంద్రాలకు తీసుకురావాలని తేమ శాతం 8 నుంచి 12 శాతం మధ్యలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధిక తేమ శాతం కారణంగా పత్తి ధర తగ్గే అవకాశం ఉందని, తేమ శాతం సరిగ్గా ఉంటే మద్దతు ధరను పొందవచ్చని తెలిపారు.ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎంపీ రఘునందన్ రావు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర్ రావు, మండల వ్యవసాయాధికారి సాయికిరణ్, సీపీఓ దుర్గాప్రసాద్, ఏఎంసీ కార్యదర్శి సుగ్రీవ్, పాక్స్ చైర్మన్ అన్నారెడ్డిగారి వెంకట్ రెడ్డి,బీజేపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.