3 May, 2026 | 2:53 AM

మార్కెట్లకు మోడీ బూస్ట్

04-06-2024 12:05 AM

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలు నమోదు చేశాయి. ప్రధాన సూచీలయిన సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. గత వారంలో తొలి అయిదు రోజులు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు వారాంతమైన శుక్రవారం మాత్రం స్వల్ప లాభాలతో ముగిసాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి ప్రభావం గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్, ఢిల్లీ లాంటి  కీలక రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పోటీని ఇవ్వవచ్చన్న వార్తలు మార్కెట్‌పై కూడా ప్రభావం చూపించాయి.

అయితే, శనివారం చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీకూడా ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారం చేపట్టనున్నట్లు  పేర్కొనడం దలాల్ స్ట్రీట్‌కు మంచి బూస్ట్‌నిచ్చింది. దీనికితోడు జీడీపీ గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు తోడవడంతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2 వేల పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. రోజంతా కూడా అదే ఊపు కొనసాగింది.

దీంతో మునుపెన్నడూ చూడని రికార్డు గరిష్ఠాలకు సూచీలు తాకాయి. సెన్సెక్స్ తొలిసారి 76,400 పాయింట్ల మార్కును అందుకోగా, నిఫ్టీ సైతం 23,200 పాయింట్ల ఎగువన ముగిసింది. సెన్సెక్స్ 2,500 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 733 పాయింట్లు వృద్ధి చెందింది. మదుపరుల సంపదగా భావించే బీఎస్సీలో  నమోదిత కంపెనీల మొత్త ం విలువ రూ.12.50 లక్షల కోట్ల మేర పెరగ్గా ఆ మేరకు మదుపరులు లాభపడినట్లు అయింది. 

ఆరంభంలోనే సెన్సెక్స్ దాదాపు 2,500 పాయింట్ల లాభంతో మొదలు కావడంతో మదుపరులంతా ఆ ఉత్సాహం కాస్సేపే అనుకున్నారు. ఎందుకంటే, స్టాక్ మార్కెట్ పెద్ద జూదం లాంటిది. ఓ చిన్నపాటి షాక్ తగిలినా దాని ప్రభావం మదుపరులపై పడుతుంది. అయితే ఈసారి మాత్రం అలా జరగలేదు. ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ట్రేడింగ్ ముగిసేదాకా అదే దూకుడు కొనసాగింది. ఒక దశలో 76,738 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. అంటే, దాదాపుగా  2,777 పాయింట్లు పెరిగింది. కానీ, చివరికి 2,507 పాయింట్ల లాభంతో ముగిసింది.

నిఫ్టీ సైతం 733 పాయింట్లు పెరిగింది. మరోవైపు డాలరుతో రూపాయి 44 పైసల మేర బలపడింది. సెన్సెక్స్‌లో  నాలుగైదు కంపెనీల షేర్లు మినహా మిగతా అన్నీ భారీగా లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో అదానీ గ్రూపు స్టాక్స్ అన్నీ లాభాలబాటలో పరుగులు తీయడం గమనార్హం. ఆ గ్రూపునకు చెందిన పది లిస్టెడ్ కంపెనీలూ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా అదానీ పవర్ స్టాక్ అత్యధికంగా 16 శాతం లాభపడగా, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 10 శాతానికి పైగా లాభపడింది.

మంగళవారం వెలువడే పూర్తి ఫలితాలు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఉన్న పక్షంలో మార్కెట్ల జోష్ ఒకటి రెండు రోజులు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. నైరుతి రుతుపవనాలు కూడా అనుకున్న దానికన్నా ముందుగానే దేశంలోకి ప్రవేశించడం, వర్షాలు కూడా ఆశించిన స్థాయిలోనే ఉండడం కూడా సూచీలు పెరగడానికి దోహదం చేశాయని అంటున్నారు. అయితే, సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో కరెక్షన్‌కు అవకాశాలు కూడా లేకపోలేదని నిపుణులు అంటున్నారు. ఫలితాల దృష్ట్యా కొద్ది రోజులు మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉండే ప్రమాదం ఉందని, ఆచితూచి పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని కూడా మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మదుపరులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.