16 July, 2026 | 1:21 AM

ఆదిలాబాద్ సీసీఐని తెరవండి

16-07-2026 01:19 AM
  1. కేంద్రం సానుకూలం.. రాష్ట్రం ఎందుకు మౌనం?  
  2.   6 వేల కుటుంబాలను రోడ్డున పడేయొద్దు 
  3. సీసీఐని తెరిచేదాకా పోరాటం 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి) : ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్లాంట్‌ను వెంటనే తెరిపించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సీసీఐ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని స్పష్టం చేశారు. వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించే సీసీఐ ప్లాంట్‌ను తెరిపించే వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

మాజీ మంత్రి జోగురామన్న, రాజ్యసభ బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో సీసీఐ సాధన సమితి బృందంతో కలిసి బుధవారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్లాంట్ పునరుద్ధరణ అవకాశాలు, ఆటంకాలపై కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్లాంట్ ఒకప్పుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు వేల మందికి ఉపాధి కల్పించి, వారి కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిందని గుర్తు చేశారు.

ఇక్కడ రాబోయే వందేళ్లకు సరిపడా సున్నపురాయి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఈ ప్లాంట్‌ను తిరిగి విజయవంతంగా నడపడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ సీసీఐని తప్పకుండా తెరిపిస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ, నేడు ప్లాంట్‌లోని యంత్రాలను తుక్కు కింద మార్చి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ. 2,000 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదన

తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు. అక్కడ 2,300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, అందులో 770 ఎకరాలు కంపెనీకి చెందిన పట్టా భూమి కాగా, 1,500 పైచిలుకు ఎకరాలు లీజ్ రూపంలో ఉందని మంత్రికి వివరించారు. కాగా రూ. 2,000 కోట్ల పెట్టుబడితో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారని కేటీఆర్ వెల్లడించారు. అయితే, ఈ ప్లాంట్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన ఆటంకంగా మారిందని ఆరోపించారు. 

సీసీఐ పునరుద్ధరణకు ఇన్సెంటివ్స్, పవర్ సబ్సిడీ, క్యాపిటల్ సబ్సిడీ, జీఎస్టీ ్ట మినహాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం ప్రతిపాదనలు కోరుతున్నా స్పందించడం లేదని, మైనింగ్ లీజ్ పొడిగించడానికి ముందుకు రావడం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. ‘బీఆర్‌ఎస్ హయాంలో సిర్పూర్ పేపర్ మిల్లుకు అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి, వెంటబడి తెరిపించి వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం’ అని గుర్తు చేశారు.

రూ. 2 వేల కోట్ల పెట్టుబడిలో రూ.500 కోట్లు సమకూరిస్తే మిగతాది లోన్ రూపంలో వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. లోన్ నిధులు రూ.500 కోట్లలోనూ రూ.250 కోట్లు రాష్ట్రం, రూ.250 కోట్లు కేంద్రం భరిస్తే ప్లాంట్ తెరుచుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతపడ్డప్పుడు కూడా బీఆర్‌ఎస్ స్పందించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీసీఐ పునరుద్ధరణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.  

బీఆర్‌ఎస్ పోరాటంతోనే నార్లాపూర్‌లో జల గర్జన

బీఆర్‌ఎస్ పోరాటాల ఫలితంగానే పాలమూరు- ప్రాజెక్టులో కీలకమైన నార్లాపూర్‌లో ఈ జలగర్జన అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది రైతులతో కలిసి బీఆర్‌ఎస్ సాధించిన విజయమన్నారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. అన్నదాతల పక్షాన గులాబీ సైనికులు అలుపెరగకుండా అన్నివైపులా ఒత్తిడి పెంచడంతోనే సీఎం రేవంత్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

దశాబ్దాలపాటు దగాపడ్డ దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ సమున్నత సంకల్పం నేటికి ఏమాత్రం చెక్కచెదరలేదని, పాతాళం నుంచి నీటిని ఎత్తిపోస్తున్న ఈ దృశ్యాలే సగర్వంగా చాటి చెబుతున్నాయని స్పష్టం చేశారు. నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పరవళ్లు తొక్కుతున్న కృష్ణాజలాలు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనాలన్నారు. రెండున్నరేళ్లుగా కాళేశ్వరంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావుపెట్టి రైతులకు తీరని అన్యాయం చేసినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు.