సమస్యలపై నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలి
జిల్లా ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మహిళలు, బాలికలు తమ సమస్యలపై భయపడకుండా పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. మండలంలోని పాడిబండ గ్రామంలో శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, బాలికలు వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, ఈవ్‌టీజింగ్ వంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్భయంగా పోలీస్ శాఖను ఆశ్రయించాలని కోరారు. మహిళల భద్రతకు తెలంగాణ పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో షీ టీమ్స్, భరోసా సెంటర్లు, ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ సేవలు, డయల్-100, డయల్-112, హాక్ ఐ, మహిళా హెల్ప్‌లైన్-181, చైల్డ్ హెల్ప్‌లైన్-1098 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని కోరారు. గ్రామసభలో గ్రామస్తులు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్ బి సిఐ సతీష్, డిఎల్ పి ఓ ఉమర్, భరోసా సెంటర్ ఇన్‌చార్జి ఎస్‌ఐ దివ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






