6 June, 2026 | 4:38 PM

Breaking News

వికారాబాద్‌లో ఘోరప్రమాదం.. హోటల్ స్లాబ్ కూలి ఒకరు మృతి   •   హైదరాబాద్‌లో భారీ వర్షం   •   ధాన్యం అన్‌లోడ్ ఆలస్యం.. రాజీవ్ రహదారిపై రైతుల బైఠాయింపు   •   అధికార లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ రాజు అంత్యక్రియలు   •   Phone Tapping Case: కేసీఆర్‌పై ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు   •   బడి ఈడు పిల్లలను పాఠశాలలు చేర్పించాలి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం : జిల్లా కలెక్టర్ అంకిత్   •   అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి   •   ఇసుక కొరతను నివారించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి   •   మంథని టీజీఎస్‌ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక   •  

భైంసా అభివృద్ధికి సమష్టి కృషి అవసరం

06-06-2026 03:36 PM

భైంసా,(విజయక్రాంతి): భైంసా మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం భైంసా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపాలిటీ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వెంటనే పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

అభివృద్ధి కోసం పనిచేయాలి: ఎమ్మెల్యే

మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి విభేదాలకు తావు లేకుండా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా కౌన్సిలర్లు చొరవ చూపాలని కోరారు. సమస్యలు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించాలని పేర్కొన్నారు.

 అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు: ఎస్పీ

ప్రజలంతా సామరస్య వాతావరణంలో కలిసి మెలిసి జీవించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు లేదా కల్లోలాలు సృష్టించే విధంగా వ్యవహరించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, మున్సిపల్ కమిషనర్ యాదయ్య, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.