4 June, 2026 | 4:30 PM

పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి

04-06-2026 03:22 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ పురపాలికను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌక్ తీరం రాజ్ టాకీస్ చౌరస్తా వరకు గల రహదారిని మున్సిపల్ అధికారులు, స్థానిక వార్డు కౌన్సిలర్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని తెలిపారు.

మున్సిపల్ అధికారులు ప్రతిరోజు మురుగు కాలువలు శుభ్రపరచాలని, ప్రతి రోజు తడి, పొడి చెత్తను సేకరించాలని తెలిపారు. పట్టణంలోని గురుకృప టిఫిన్ సెంటర్ నిర్వాహకులు నీటిని, వినియోగించిన ప్లేట్లను రోడ్డుపై పడవేసినందుకు టిఫిన్ సెంటర్ యజమానికి జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతిని ఆదేశించారు. దుకాణాల యజమానులు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్లను రోడ్డుపై పడవేయకుండా చెత్త కుండీలో వేయాలని, పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.