ఇందిరా మహిళా శక్తి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న జిల్లా మహిళా సమాఖ్య ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో 6 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మిస్తున్న జిల్లా మహిళా సమాఖ్య ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ ధర్మేందర్ లతో కలిసి సందర్శించి పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 6 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని తెలిపారు. భవనానికి రంగు, విద్యుత్ సంబంధించిన పనులు, కిటికీలు, దర్వాజాలు బిగించే పనులను వేగవంతం చేయాలని గుత్తేదారును ఆదేశించారు. భవన నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, భవన నిర్మాణం గుత్తేదారు, తదితరులు పాల్గొన్నారు.






