16-07-2025 06:47:29 PM
హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): సికిల్ సెల్ అనీమియాపై గిరిజనులు అవగాహన కలిగి ఉండాలి అని హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సికిల్ సెల్ అనీమియా పై ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్ , సబ్ యూనిట్ అధికారి నాందేవ్ లు ఫెసిలిటేటర్లుగా హాజరై విద్యార్థులకు సికిల్ సెల్ అనీమియా రుగ్మత గురించి వివరించారు.
ఈ సందర్భంగా అల్లాడి శ్రీనివాస్ మాట్లాడుతూ... సికిల్ సెల్ అనీమియా ఒక జెనిటిక్ (వంశపారంపర్య) రక్త వ్యాధి. ఈ వ్యాధిలో ఎర్ర రక్త కణాలు వక్రాకారంలోకి ( కొడవలి ఆకారంలోకి) మారి రక్త ప్రసరణలో ఆటంకం కలిగిస్తాయి. ఇది ప్రధానంగా గిరిజన సమాజాల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ముందస్తుగా రక్త పరీక్షలు చేయించుకోవడం, వైద్య సలహాలు పాటించడం ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు... క్యారియర్గా ఉన్న వాళ్లు ఇంకో క్యారియర్ ను పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు సికిల్ సెల్ బారిన పడే అవకాశం ఉందని వారు వివరించారు.
అనంతరం సబ్ యూనిట్ అధికారి నాందేవ్ మాట్లాడుతూ... సికిల్ సెల్ అనీమియా రుగ్మతకు సంబంధించిన లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్సా విధానాల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం అన్నారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ శాతం బాధితులు ఉండటం వల్ల సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడించారు. అన్ని గిరిజన పాఠశాలల్లో సికిల్ సెల్ అనీమియా నిర్దారణకై రక్త పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.