9 June, 2026 | 1:22 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సభలు

09-06-2026 12:34 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, జూన్ 8 (విజయక్రాంతి) : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన గ్రామ, డివిజన్, వార్డు సభలలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31, 32 డివిజన్లకు సంబంధించి లక్ష్మీ గార్డెన్స్ లో  నిర్వహించిన డివిజన్ సభకు డిసిపి ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య, మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, 31వ డివిజన్ కార్పొరేటర్ సంపత్ రెడ్డి లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రత్యేక గ్రామ/డివిజన్/వార్డు సభలు నిర్వహించి, పారిశుధ్యం, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ, అరైవ్- అలైవ్, ఇందిరమ్మ ఇండ్లు, సంబంధిత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్ల సహకారంతో ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాల అందజేత, స్వీకరణ, చనిపోయిన, డబుల్, షిఫ్టెడ్ ఓటర్ల తొలగింపు ప్రక్రియ క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్- అలైవ్ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విద్యావవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వైద్యం, విద్య, మహిళా రక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.  రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బాలికల సంరక్షణ కొరకు షీ టీం సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.

యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా చూడాలని, తెలిసిన వాళ్ళు ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగించినట్లు సమాచారం ఇస్తే వారిని డి-అడిక్షన్ సెంటర్ కు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల సంబంధిత ప్రొసీడింగ్స్ ను లబ్ధిదారులకు అందజేశారు.

అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ 

మంచిర్యాల, జూన్ 8 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సోమ వారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. కాలేజ్ రోడ్డు లో కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించి పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు 129.25 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.