లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేక ప్యాకేజీ
- జనజీవన స్రవంతిలోకి రండి.. అగ్రనేత గణపతికి సీఎం రేవంత్ పిలుపు
- సీఎం సమక్షంలో.. 124 ఆయుధాలతో పీఎల్జీఏ కమిటీ సభ్యులు 130 మంది సరెండర్
- ఆర్థిక, ఆరోగ్య భద్రతతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తాం ముఖ్యమంత్రి వెల్లడి
- ఇక మావోయిస్టు రాష్ట్ర కమిటీ లేదు: డీజీపీ శివధర్‌రెడ్డి
హైదరాబాద్, సిటీబ్యూరో మార్చి ౭ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలపాటు దండకారణ్యంలో అజ్ఞాతజీవితం గడుపుతూ, తుపాకీగొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమంటూ సాయుధ పోరాటం చేసిన మావోయిస్టులో ఏకంగా 130 మంది ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివా రం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీసీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను విడిచిపెట్టి అధికారికంగా జనజీవన స్రవంతిలో కలిశారు.
ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీలు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికా రుల నిరంతర కౌన్సెలింగ్ సత్ఫలితాలను ఇవ్వడంతో.. భారీ సంఖ్యలో దళ సభ్యు లు సాధారణ జీవితం గడిపేందుకు ముందుకొచ్చారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత దేవ్ జీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమిటీ (పీఎల్జీఏ) సభ్యులు మూకుమ్మడిగా సరెండర్ అయ్యారు.
లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది సాధా రణ పార్టీ సభ్యులు ఉన్నారు. వీరంతా దండకారణ్యంలో దశాబ్దాలుగా వినియోగించిన భారీ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీటిలో ఒక ఇన్సాస్ ఎల్‌ఎంజీ రైఫిల్, 31 ఏకే -47 రైఫిళ్లు, 21 ఇన్సాస్ రైఫిళ్లు, 20 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 18 త్రీనాట్త్రీ 303 రైఫిళ్లు, 33 ఇతర దేశవాళీ మారణాయుధాలు మొత్తం 124 ఆయుధాలు ఉన్నాయి.
ఈ లొంగుబాటు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపును గౌరవించి లొంగిపోయిన మావోయిస్టులు అందరికీ ఆయన స్వాగతం పలికారు. ‘జనజీవన స్రవంతిలోకి వచ్చిన మీ అందరి భద్రతకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుంది. మీ ఆర్థిక, ఆరోగ్య భద్రతకు ఇక ఎలాంటి ఢోకా ఉం డదు’ అని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా శాంతియుత వాతావరణంలోనే ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, కేవలం శాంతి మార్గంలోనే మహా త్మాగాంధీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టారని ఆయన గుర్తుచేశారు.
ఇటీవల లొంగి పోయిన కీలక నేతలు దేవ్ జీ, రాజిరెడ్డిలతో సహా ఇద్దరు ముగ్గురు అగ్రనేతలతో తాను సుదీర్ఘంగా చర్చించానని, వారు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను రాష్ట్ర పరిధిలోనే తప్పక పరిష్కరిస్తానని సీఎం మాటిచ్చారు. ఇదే అంశంపై ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడానని, ఆయుధాలతో లొంగిపోయిన వారికి పూర్తి పునరావాసం కల్పించాలని కేం ద్రం కూడా సూచించిందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేత, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతికి సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా పిలుపునిచ్చారు. ‘అగ్రనేత గణపతి సహా ఇంకా అజ్ఞాతంలో ఉన్న మిగిలిన ఏడుగురు మావోయిస్టులు నేతలు కూడా తక్షణమే లొంగిపోవాలి. జనజీవన స్రవంతిలోకి రండి.. మీ అందరి భద్రతకు తెలంగాణ ప్రభుత్వమే పూర్తి భరోసా ఇస్తుంది’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
లొంగిపోయిన మావోయిస్టులకు వారి హోదాలను బట్టి ప్రత్యేక ప్యాకేజీ కల్పిస్తామని, ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, రాష్ట్రంలో వ్యవసాయ భూమి లభ్యత కష్టంగా ఉన్నందున భూమి ఇవ్వడంపై మాత్రం తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని సీఎం తేల్చిచెప్పారు. సరెండర్ అయిన వారికి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేకమైన హెల్త్ కార్డులు ఇస్తామని,
పునరావాస నగదును కూడా పెంచేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో హింసకు తావులేదని, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే ఎంతటి వారినైనా సహించేది లేదని సీఎం హెచ్చరించారు. లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే వారికి మా ఆహ్వానం ఉంటుందని, వారు పీసీసీని సంప్రదించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.
స్టేట్ కమిటీ ఇక లేదు: డీజీపీ
ఈ భారీ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుందని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడి ంచారు. లొంగిపోయిన వారిలో తెలంగాణ స్టేట్ కమిటీకి చెందిన ఐదుగురు కీలక సభ్యు లు ఉండటంతో.. ఇకపై తెలంగాణ రాష్ట్ర కమిటీ అనేది లేకుండా పోయిందని, అది కేవలం చరిత్రకే పరిమితమైందని డీజీపీ సంచలన ప్రకటన చేశారు.
తుపాకీ ద్వారానే మార్పు వస్తుందని, దశాబ్దాల పాటు తెలంగాణ నాయకుల నేతృత్వంలో దేశవ్యాప్తంగా పోరాటం కొనసాగించిన మావోయిస్టు పా ర్టీకి.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర కమి టీ లేకుండా పోవడం ఆ పార్టీకి తీరని లోట ని ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు తెలంగాణ పోలీసుల ముందు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారి నుంచి 266 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఇంకా తెలంగాణ నుంచి ఏడుగురు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించామని చెప్పా రు. సీఎం ఇచ్చిన పిలుపు మేరకు, ఆ మిగిలిన ఏడుగురు కూడా వీలైనంత త్వరగా సరెండర్ కావాలని, హింసను వీడి తమ కుటుంబాలతో ప్రశాంత జీవనం గడపాలని డీజీపీ పిలుపునిచ్చారు. మాపై నమ్మకం పెట్టుకుని జనజీవన స్రవంతిలోకి వచ్చిన అందరినీ కాపాడుకునే బాధ్యత పోలీసు శాఖదేనని ఆయన భరోసా ఇచ్చారు.
ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇంతపెద్ద మొత్తంలో మావోయిస్టుల లొం గుబాటుకు కృషి చేసిన ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ అధికారులను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ లొంగుబాటు కార్యక్ర మంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితోపాటు అదనపు డీజీ ఇంటలిజెన్స్ విజయ్‌కుమార్, ఎస్‌ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు.




