8 March, 2026 | 4:58 AM

అయోమయంలో.. ఆక్వా, పౌల్ట్రీ!

08-03-2026 01:36 AM

యుద్ధం ముంచుతోంది!

  1. గుడ్లు, రోయ్యలు, చేపల ఎగుమతులకు బ్రేక్
  2. నిలిచిన సీ ఫుడ్ విలువ 300మిలియన్ డాలర్లు
  3. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్న షిప్పింగ్ కంపెనీలు
  4. ఎక్కువ కాలం నిలువ ఉంటే పాడైపోయే ప్రమాదం
  5. గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో నిల్వలు పెరిగి తగ్గుతున్న ధరలు
  6. రూ.కోట్లు నష్టపోతున్న రెండు రంగాల రైతులు 

హైదరాబాద్, మార్చి 7 : అంతర్జాతీయ సరిహద్దుల్లో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అందరూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని భయపడుతుంటే.. అంతకుమించిన ఒక పెను ముప్పు మన ఆక్వా, పౌల్ట్రీ రంగాలను ముంచేయడానికి సిద్ధంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రొయ్యల సాగు నుంచి కోళ్ల ఫారాల వరకు.. లక్షలాది మంది జీవనాధారం అయోమయంలో పడింది. ఇప్పుడు ఈ యుద్ధం  వల్ల రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. 

సముద్రంలో రూ.2500 కోట్లు..  

మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు  ఆక్వా, పౌల్ట్రీ రంగాన్ని నిలువునా ముంచేస్తున్నాయి. గల్ఫ్, యూరప్ దేశాలకు వెళ్లాల్సిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అమాం తం ఆగిపోయాయి. తాజా నివేదికల ప్రకా రం.. సుమారు 300 మిలియన్ డాలర్ల విలువైన సీ ఫుడ్ కంటైనర్లు వివిధ పోర్టుల్లో నిలిచిపోయాయి.

ఈ భారీనష్టంలో 60 శా తం వాటా తెలుగురైతులదే కావడం ఆందోళనకరం. విశాఖపట్నం, ముంబైపోర్టుల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన రొయ్యలు, చేపలకంటైనర్లు కదలడం లేదు. ఎర్రసము ద్రం, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గాల్లో దా డుల భయంతో షిప్పింగ్ నిలిచిపోయింది.

చార్జీలను రెట్టింపు చేసిన కంపెనీలు

ఒకవైపు ఎగుమతులు ఆగిపోతుంటే.. మరోవైపు షిప్పింగ్ కంపెనీలు చార్జీలను రెట్టింపు చేశాయి. ఒక్కో కంటైనర్‌పై 1500 నుంచి 4000 డాలర్ల వరకు ఎమర్జెన్సీ సర్‌చార్జీలు వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా రొయ్యలు పాడవకుండా ఉంచే రిఫ్రిజిరేటెడ్ కంటైనర్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి.

అమెరికా టారిఫ్‌ల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో.. ఈ యుద్ధం మా వెన్ను విరిచింది” అని సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ వాపోతోంది. కోల్ స్టోరేజీలు నిండిపోవడంతో, స్థానిక మార్కెట్లో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనివల్ల పల్లెల్లో రొయ్యల ధరలు దారుణంగా పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది.  

పౌల్ట్రీ రంగానికీ..

యుద్ధం ప్రభావం కేవలం సముద్ర ఉత్పత్తులపైనే కాదు మన పౌల్ట్రీ రంగంపై కూడా తీవ్రంగా పడింది. హైదరాబాద్, నామక్కల్ ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ఎగుమతులు ఆగడంతో స్థానిక మార్కెట్లో గుడ్ల నిల్వలు పెరిగి, ధరలు పడిపోతున్నాయి. 100 కోడిగుడ్ల హోల్సేల్ ధరను రూ.420కి తగ్గించినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

దీనివల్ల పౌల్ట్రీ రైతులకు రోజుకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. భారత హలాల్ మాంసం ఎగుమతుల్లో సగానికి పై గా వాటా గల్ఫ్ దేశాలదే. ఇప్పుడు ఇన్సూరెన్స్‌రేట్లు పెరగడం, కంటైనర్లు ముంబై పోర్టులోనే ఆగిపోవడంతో కోడి మాంసం పాడైపోయే పరిస్థితి ఏర్పడింది.